రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉందా?: షేక్ బాజీ - BJP Minority Morcha allegations
🎬 Watch Now: Feature Video
BJP Minority Morcha leader Sheikh Baji: రాష్ట్రంలో వైసీపీ నేతలు కొనసాగిస్తున్న అక్రమాలు, అరాచకాలను పరిశీలిస్తుంటే రానున్న సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం ఉందా? అనే అనుమానం కలుగుతోందని భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీ ఆరోపించారు. ఈనెల రెండో తేదీ సాయంత్రం కాకినాడ రూరల్‌లో లారీలో వెళుతున్న చీరెలు, బొట్టుబిళ్లలు, డూప్లికేట్ ఈవీఎంలను తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుర్తించి ఆధారాలతో సహా పట్టుకుని అధికారులకు అప్పగించారన్నారు. సీ విజిల్ ద్వారా కూడా అధికారులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. వెనువెంటనే వైసీపీ రౌడీలు అక్కడకు చేరుకుని తమ పార్టీ నేతలపై కర్రలు, రాళ్లతో దాడులు చేశారని అన్నారు. సంబంధిత వాహనాన్ని స్వాధీనం చేసుకోలేదని, అధికారుల చర్య ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
ఈ ఎన్నికలలో అడ్డదారుల్లో గెలుపు కోసం వైసీపీ నేతలు డబ్బులు పంపిణీ కార్యక్రమాలు చేస్తున్నారని, ఓటర్లను ప్రలోభ పెట్టేలా, భయభ్రాంతులకు గురి చేసేలా అన్నింటికీ సిద్దం చేసి పెట్టుకున్నారని విమర్శించారు. అధికారులను కూడా తమ చెప్పు చేతల్లో పని చేసేలా వైసీపీ నేతలు బెదిరిస్తున్న పరిస్థితి కొనసాగుతోందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఆధారాలతో సహా తాము ఫిర్యాదులు చేశామని, ఇప్పటికే కొంతమంది అధికారులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందని మరికొందరిపైనా వేటు పడుతుందనే ఆశాభావంతో ఎదురుచూస్తున్నామన్నారు.