ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి: ఏబీవీపీ
🎬 Watch Now: Feature Video
Attempt to Besiege CM Office ABVP Student Union Leaders: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ ఏబీవీపీ చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు క్యాంపు కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మెగా డీఎస్సీ పేరిట దగా డీఎస్సీ ఇచ్చారని నిరుద్యోగులు క్యాంపు ఆఫీసు ముట్టడికి యత్నించారు. 'మినీ డీఎస్సీ వద్దు మెగా డీఎస్సీ ముద్దు' అంటూ విద్యార్థి సంఘం నేతలు నినాదాలు చేశారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘం నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో విద్యార్థి సంఘం నాయకులను పోలీసులు బలవంతంగా వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రభుత్వ తీరుపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నింటికీ భర్తీ చేయాలన్నారు. 25వేల పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు.
పాదయాత్ర సమయంలో 23 వేల పోస్టులను భర్తీ చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లకు 6 వేల 100 పోస్టులు వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాట తప్పను, మడప తిప్పను అనే జగన్ వెంటనే డీఎస్సీ విడుదల చేసి మాట నిలబెట్టుకోవాలని అన్నారు. నిరుద్యోగుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు సీఎం జగన్కు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.