వైఎస్సార్సీపీ సమావేశమా? అయితే ఖచ్చితంగా గేట్లకు తాళాలు వేయాల్సిందే - ఆసరా చెక్కుల పంపిణీ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 19, 2024, 12:08 PM IST
Asara Cheques Distribution Meeting: ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయామని వాపోయారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆసరా సమావేశంలో పాల్గొన్న మహిళలు. అధికారులు రావాలని ఆదేశాలు ఇస్తే తప్పని సరి పరిస్థితిలో సమావేశానికి వచ్చామని, తీరా ఇక్కడికి వచ్చాకా సమావేశం ముగిసే వరకు ఉండాల్సిందేనని అధికారులు హుకుం జారీ చేశారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో వైఎస్సార్సీపీ నేతలు 4వ విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో 380 డ్వాక్రా సంఘాలకు 4కోట్ల రూపాయల విలువైన చెక్కులను విడుదల చేస్తున్నామని, కచ్చితంగా రావాల్సిందేనని మెప్మా అధికారులు లబ్ధిదారులకు ఆంక్షలు విధించారు. దీంతో తప్పదంటూ లబ్దిదారులు సమావేశానికి హాజరయ్యారు.
అయితే సమావేశం ఎంతకీ ముగియక పోవడంతో మహిళలు వెనుతిరగడానికి ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ నేతల మెప్పు కోసం మెప్మా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించి, సమావేశంలో పాల్గొన్న మహిళలను తాళాలు వేసి నిర్బంధించారు. తమను వెళ్లనివ్వమని బలవంతం చేయడంతో తాళాలు పోయాయని తాత్సారం చేశారు. ఆగ్రహించిన మహిళలు గేటు తాళం బద్దలు కొట్టి వెల్లువలా బయటకు దూసుకువచ్చారు. మహిళలు బయటకు వెళ్లడంతో కార్యక్రమం ముగింపు సమయానికి నేతలు ఖాళీ కుర్చీలకే ప్రసంగాలు వినిపించాల్సి వచ్చింది.