నెల్లూరు రొట్టెల పండుగ- ఈ ఏడాది భక్తుల సంఖ్యపై అంచనాలు ఇవే - Arrangements for Bread festival

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 11, 2024, 5:59 PM IST

thumbnail
రొట్టెల పండుగకు ముమ్మరంగా ఏర్పాట్లు - రూ.10 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం (ETV Bharat)

Arrangements for Bread Festival to held in Nellore District : ఈనెల 17 నుంచి ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగకు నెల్లూరు ముస్తాబవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. హిందూ-ముస్లీం ఐక్యతతో నిర్వహించే ఈ పండుగకూ ఎంతో ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం హయాంలో దీన్ని అధికారిక పండుగలా మార్చారు. ఈ ఏడాది బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగకు 15లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ పండుగను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తుంది. అందుకు తగ్గట్టుగా సుమారు రూ.10కోట్లు ఖర్చుతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి, గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 

ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండుగలో రొట్టెలు మార్చుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. నెల్లూరు స్వర్ణాల చెరువులో రొట్టెలు ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీ. సంతానం కోసం, ఉన్నత చదువులు, గృహం కోసం ఇలా తమ కోర్కెలు నెరవేరాలని స్వర్ణాల చెరువు దగ్గరికి వస్తారు. చెరువులో స్నానం చేసి తమ కోర్కెలు తీర్చమని దేవుళ్లని వేడుకుంటారు. కోర్కెలు తీరిన వారు అందుకు గుర్తుగా రొట్టెలు తెచ్చిపంచుతారు. ఆ రొట్టె అందుకున్న వారు తిరిగి తమ కోర్కెలు నెరవేరాక మళ్లీ రొట్టెలు పంచుతారు. ఈ ఆచారం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. మతసామరస్యానికి, భక్తి విశ్వాసాలకు రొట్టెల పండుగ ప్రతీక. ఈ పండుగలో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున్న భక్తులు వస్తారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.