కడప జిల్లాలో వైఎస్ షర్మిలకు భద్రత పెంపు: ఎస్పీ సిద్ధార్థ కౌశల్ - వైఎస్ షర్మిల భద్రత పెంపు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 5:18 PM IST
AP PCC Chief YS Sharmila Security Increased: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డికి భద్రత పెంచారు. వైఎస్సార్ కడప జిల్లాలో షర్మిల పర్యటన సందర్భంగా భద్రతను పెంచుతున్నట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. ప్రస్తుతం షర్మిలకు వన్ ప్లస్ వన్ స్థానంలో 2 ప్లస్ 2 గన్మెన్లను కేటాయించినట్లు ఎస్పీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల షర్మిల తనకు భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఇటీవల ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు భద్రత కల్పించడం లేదంటే తన చెడు కోరుకున్నట్లే కదా అని వ్యాఖ్యానించారు. దీంతో రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఆమెకు భద్రత పెంచుతున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఎవరి ప్రాణాలకైనా ముప్పు ఉన్నట్లు సమాచారం అందిస్తే అన్ని వివరాలను ఆరా తీసి వారికి తగిన విధంగా భద్రత కల్పిస్తామని ఎస్పీ తెలియజేశారు. తనకు భద్రత పెంచాలని ఇటీవల వైఎస్ షర్మిల డీజీపీకి లేఖ రాసిన సందర్భంలో వైఎస్సార్ జిల్లాలో ఆమెకు మొదటగా 2+2 భద్రతను పెంచుతున్నట్లు అధికారికంగా వెల్లడించారు.