పన్నులు పెంచితే ఆదాయం పెరుగుతుందని జగన్ భావించాడు- ఆర్ధిక మంత్రి పయ్యావుల - payyavula keshav about high taxes
🎬 Watch Now: Feature Video
Payyavula Keshav about High Taxes: పన్నులను పెంచడం ద్వారా రాబడి పెంచుకోవాలనే జగన్ ఆలోచనా విధానం వల్ల ఏపీలో వ్యాపారాలే లేకుండా పోయాయిని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు. ఏపీ ఆర్థికశాఖని జగన్ ధ్వంసం చేసేశారని దుయ్యబట్టారు. చంద్రబాబుతోనే ఏపీ ఎకానమీ రివైవ్ అవుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం విపరీతంగా పన్నులు పెంచేసిందని, వ్యాపారాలు చేసుకోలేనంత స్థాయిలో పన్నులను పెంచడంతో ఆర్థిక పరిస్థితి దెబ్బతిందన్నారు. పన్నులు తక్కువగా ఉన్నాయని పొరుగు రాష్ట్రాల్లో వాహనాలు కొన్నారని, అదే విధంగా పెట్రోల్ సైతం పొరుగు రాష్ట్రాల్లోని కొట్టించుకునేవారని గుర్తు చేసారు. ఆర్టీసీకి కూడా కర్ణాటక నుంచే డీజిల్ కొట్టించిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఒక్క ఫార్చూనర్ కారు పక్క రాష్ట్రంలో కొనడం వల్ల రాష్ట్రం 16 లక్షల మేర ఆదాయం కొల్పోతోందని తెలిపారు.
దీని కారణంగా పరుగులు పెట్టాల్సిన ఏపీ ఆర్థిక శాఖ వ్యవస్థ ఆగిపోయిందని విమర్శించారు. కేంద్ర నిధులకు సంబంధించిన సుమారు 18-20 పథకాలు ఆపేశారని మంత్రి పయ్యావుల మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల నగదు లావాదేవీలు ఆగిపోయాయని వెల్లడించారు. ఏపీ ఎకానమీని జగన్ కుప్పకూల్చారని మండిపడ్డారు. ఆదాయం పెరగాలంటే పన్నులు పెంచడమే మార్గం కాదని, పన్నుల విస్తృతిని పెంచాలని సూచించారు. కాగా నేడు ఆర్థిక శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు స్వీకరించారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై పయ్యావుల తొలి సంతకం చేశారు. స్థానిక సంస్థలకు 250 కోట్ల మేర నిధులు విడుదల చేశారు.