ఉప్పొంగిన ఆనందం - ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో జెండా పాతిన విద్యార్థులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : 3 hours ago
Amaravati SRM University Students on Everest Mountain : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ అధిరోహించాలని కలలుగనని పర్వతారోహకులు ఉండరు. కానీ, అదేమంత ఈజీ కాదు. అడుగడుగునా ఎన్నో ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు దాటుకుని ముందుకెళితే లక్ష్యం చేరేవారు కొందరే. అలాంటి సాహసయాత్రకు శ్రీకారం చుట్టి ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో జెండా పాతారు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విద్యార్థులు.
ఆ కుర్రాళ్లు ఎవరెస్ట్ ఎక్కుతామనేసరికి బంధు, మిత్రులు ఆశ్చర్యపోయారు. ఎవరెస్ట్ ఎక్కడమంటే ఈజీ కాదు అన్న వాళ్లూ లేకపోలేదు. అయినా వెనక్కు తగ్గకుండా సాధన చేశారు. 5వేల మీటర్లకు పైగా ఉన్న ఎవరెస్ట్ బేస్ క్యాంపు చేరుకుని జెండా పాతారు. ఏపీ రాజధాని అమరావతిలో ప్రారంభమైన ప్రయాణం ఎవరెస్ట్ మజిలీ చేరుకునే వరకు ఎన్నో అడ్డంకులు, ఆటుపోట్లు ఎదురయ్యాయి. వాటిని అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న వేళ ఎనలేని ఆనందంతో పొంగిపోయారు. రాజధాని ప్రాంతంలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ విద్యార్ధుల ఎవరెస్ట్ ప్రయాణం అనుభవాలను మనతో పంచుకున్నారిలా.