ప్రభుత్వ ఆసుపత్రిలో వికటించిన ఇంజెక్షన్- అస్వస్థతకు గురైన ఏడుగురు చిన్నారులు
🎬 Watch Now: Feature Video
7Children Get Sick After Injection in Machilipatnam Government Hospital: చిన్నారులకు నిమ్ముగా ఉందని ఆసుపత్రికి చేరిస్తే వారు చేసిన వైద్యం వికటించి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్పటి వరకూ ఆడుకుంటూ ఉన్న చిన్నారులు అకస్మికంగా వాంతులు, చలి, జ్వరానికి గురయ్యారని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది.
చిన్నారుల తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలో మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల విభాగంలో మొత్తం 15 మంది చికిత్స పొందుతున్నారు. వైద్యం పొందుతున్న చిన్నారులకు శుక్రవారం రాత్రి ఆస్పత్రి సిబ్బంది ఇంజక్షన్ చేశారు. ఇంజక్షన్ చేసిన అరగంటకు చిన్నారులకు విపరీతమైన చలి, జ్వరం రావడాన్ని గమనించిన తల్లిదండ్రులు వైద్యులకు తెలియజేశారు. ఇంజక్షన్ చేసిన వారిలో ఏడుగురు పిల్లలకు అస్వస్థతగా ఉండటంతో అప్రమత్తమైన సిబ్బంది చిన్నారులను ఇంటెన్సివ్ కేర్‌కు తరలించి వైద్యం అందించారు. ప్రస్తుతం అందరి పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. రోజువారి ఇంజెక్షన్ కాకుండా వేరేది చేయటం వల్ల పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తల్లిదండ్రులు తెలిపారు.