Google Maps New Features : గూగుల్ మ్యాప్స్ (Google maps) సాయంతో మనం కార్లో వెళుతుంటాం. నేరుగా వెళ్లాలని మ్యాప్‌లో చూపిస్తుంటుంది. కానీ ఎదురుగా ఫ్లైఓవర్, దాని దిగువన సర్వీస్ రోడ్డు ఉంటుంది. అలాంటప్పుడు పై నుంచి వెళ్లాలా? లేదా కింది నుంచి వెళ్లాలా? అనే సందేహం చాలా మందికి వస్తుంటుంది. దీనికి పరిష్కారంగా గూగుల్ మ్యాప్స్ తాజాగా ‘ఫ్లైఓవర్ కాల్ ఔట్’ పేరిట కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ యూజర్లు ఎప్పటి నుంచో కోరుతున్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. అయితే ఐఓఎస్ యూజర్లకు మాత్రం ఇది కాస్త ఆలస్యంగా లభించే అవకాశం ఉంది.
గూగుల్ నయా ఫీచర్లపై గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి మాట్లాడుతూ, ‘రోడ్డుపై వెళుతున్నప్పుడు నేరుగా ఫ్లై ఓవర్ మీద నుంచి వెళ్లాలా? సర్వీస్ రోడ్డు నుంచి వెళ్లాలా? అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఈ సమస్యను పరిష్కరించడానికే ‘ఫ్లైఓవర్ కాల్ ఔట్’ ఫీచర్‌ను తీసుకొచ్చాం’ అని ఆమె తెలిపారు. దేశంలోని 40 నగరాల్లో ఈ వారం చివరిలోగా ఆండ్రాయిడ్ మ్యాప్స్, ఆండ్రాయిడ్ ఆటో యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని ఆమె చెప్పారు. ఐఓఎస్, కార్ ప్లే యూజర్లకు కూడా త్వరలో ఈ సదుపాయాన్ని అందిస్తామని ఆమె పేర్కొన్నారు.
Thank you, Google India for adding take flyover feature. 🙏 pic.twitter.com/LYDDVNnUN3
— Abhishek Yadav (@yabhishekhd) July 25, 2024
ట్రాఫిక్ కష్టాలకు చెక్
గూగుల్ మ్యాప్స్ మరో 5 ఫీచర్లను కూడా ఇండియన్ యూజర్ల కోసం తీసుకువస్తోంది. వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
- ఇరుకు రోడ్లకు సంబంధించిన సమాచారం ఇచ్చేందుకు గూగుల్ మ్యాప్స్ మరో ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఫోర్ వీలర్లో వెళ్లేటప్పుడు రోడ్లు ఇరుకుగా ఉంటే, వాటి గురించి గూగుల్ మ్యాప్స్ ముందే యూజర్లకు తెలియజేస్తుంది. తొలుత 8 నగరాల్లో ఈ సదుపాయాన్ని తీసుకొస్తున్నామని గూగుల్ తెలిపింది. ఒకవేళ అదే రోడ్డులో వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా వెళ్లాలని కూడా గూగుల్ మ్యాప్స్ సూచిస్తుంది.
- దేశంలో విద్యుత్ వాహనాలు పెరుగుతున్న నేపథ్యంలో, యూజర్లకు సమీపంలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్ల వివరాలు అందించే మరో ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్ తీసుకువస్తోంది. ముఖ్యంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వివరాలతోపాటు, పోర్టు టైప్ వంటి వివరాలు అందులో లభిస్తాయి.
- ఓఎన్‌డీసీ భాగస్వామ్యంతో మెట్రో టికెట్లను కూడా బుక్ చేసుకొనే మరో సదుపాయాన్ని గూగుల్ ప్రకటించింది. తొలుత చెన్నై, కొచ్చిలో ఈ సదుపాయాన్ని తీసుకురానున్నారు.
- గూగుల్ మ్యాప్స్ 'లోకల్ రికమండేషన్స్' అనే మరో ఫీచర్‌పై వర్క్ చేస్తోంది. దేశంలోని 10 ప్రముఖ నగరాలు, పర్యాటక ప్రదేశాల్లో దీనిని తీసుకువస్తామని గూగుల్ స్పష్టం చేసింది. దీని వల్ల ప్రయాణికులు తమ గమ్య స్థానాన్ని సులువుగా చేరుకునేందుకు, తమకు నచ్చిన పర్యాటక ప్రదేశానికి వెళ్లేందుకు వీలవుతుంది.
- గూగుల్ 'రిపోర్ట్ ఇన్సిడెంట్స్' అనే మరో ఫీచర్‌ను తీసుకువస్తున్నట్లు తెలిపింది. దీని వల్ల మీరు వెళ్లే మార్గంలో ఏదైనా అవాంతరాలు (ఉదాహరణకు యాక్సిడెంట్, రోడ్ బ్లాక్, ధర్నాలు, ట్రాఫిక్ జామ్‌లు లాంటివి) ఉంటే, ఆ విషయాన్ని మీకు గూగుల్ మ్యాప్స్ ముందుగానే తెలియజేస్తుంది.
పిల్లల కోసం యాపిల్ వాచ్‌లో సరికొత్త ఫీచర్ - ఎలా పనిచేస్తుందంటే? - Apple Watch For Your Kids