Amazon Echo Show 21: ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సరికొత్త వాల్ మౌంటెడ్ స్మార్ట్ డిస్‌ప్లేను తీసుకొచ్చింది. 'ఎకో షో 21' పేరుతో దీన్ని లాంచ్ చేసింది. అమెజాన్ నుంచి వచ్చిన అతిపెద్ద, అత్యంత పవర్ఫుల్ స్మార్ట్ డిస్‌ప్లే ఇదే. రెండేళ్ల క్రితం కంపెనీ తీసుకొచ్చిన 'ఎకోషో 15'కు అదనపు హంగులు జోడించడంతో పాటు, అంతకంటే దాదాపు రెండింతల పరిమాణంలో పెద్ద డిస్‌ప్లేతో దీన్ని తీసుకొచ్చింది. అయితే 'ఎకోషో 15', 'ఎకో షో 21' రెండింటిలో ఫీచర్లు దాదాపు ఒకే విధంగా ఉంటాయి.
ఈ స్మార్ట్ డిస్‌ప్లేలను రిమోట్ సాయంతో పాటుగా అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌తో కంట్రోల్ చేయొచ్చు. షాపింగ్ లిస్ట్, క్యాలెండర్, వెథర్ ఇన్ఫర్మెషన్, టు-డు లిస్ట్ కోసం వీటిని ఉపయోగించొచ్చు. అంతేకాక యూట్యూబ్, ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ కంటెంట్‌ను కూడా ప్లే చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఈ డిస్‌ప్లేలను ఫొటో ఫ్రేమ్స్గా కూడా వినియోగించుకోవచ్చు. వాటిలో మీ కుటుంబ సభ్యుల ఫొటోలను డిస్‌ప్లే చేయొచ్చు.
ఇతర స్మార్ట్ డివైజులను ఎకో షో ద్వారా మేనేజ్ చేయొచ్చు. వీటి సాయంతో ఆడియో, వీడియో కాల్స్‌ను చాలా స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. అంతేకాదండోయ్.. మీరు బయటికి వెళ్లినప్పుడు ఇల్లు ఎలా ఉంది? ఇంట్లో పిల్లలు ఏం చేస్తున్నారు? పెంపుడు జంతువులు ఏం చేస్తున్నాయి? వంటి పరిస్థితులను వీటి ద్వారా ఆరా తీయొచ్చు. అంటే మొత్తంగా వీటిని ఆల్-ఇన్-వన్‌గా వాడేసుకోవచ్చన్న మాట. ఇంట్లో కావాల్సిన చోట వీటిని అమర్చుకోవచ్చు.
అమెజాన్ 'ఎకో షో 21', 'ఎకోషో 15' స్మార్ట్ డిస్‌ప్లేల ధర: అమెజాన్ నుంచి ఈ సరికొత్త 'ఎకో షో 21', 'ఎకోషో 15' స్మార్ట్ డిస్‌ప్లేలను కొనుగోలు చేయొచ్చు. 'ఎకో షో 21' ధరను కంపెనీ 399 డాలర్లు (రూ.33 వేలు)గా నిర్ణయించింది. ఇక 'ఎకోషో 15' ధర 299 డాలర్లు (రూ.25 వేలు). అయితే వీటిని ఇండియాలో లాంచ్ చేయడంపై క్లారిటీ ఇవ్వలేదు. అంటే ఇది భారత్‌లో లాంచ్ అవుతుందో లేదో చెప్పలేం.
వారెవ్వా.. BMW కొత్త కారు ఏం ఉంది భయ్యా.. ఒక్క చూపుకే ఫిదా అయిపోవడం ఖాయం!
'సూపర్ కెమెరా'తో రెడ్మీ 'నోట్ 14 5G' సిరీస్- టీజర్ చూశారా?