YSRCP Neglected to Build Kattaleru Bridge People Suffering With Floods : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని కట్టలేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. గంపలగూడెం మండలం వినగడప సమీపంలోని కట్టలేరు వంతెనపై భారీగా వరదనీరు చేరింది. అప్రమత్తమైన రెవెన్యూ, పోలీసు అధికారులు వంతెనపై రాకపోకలు నిలిపేశారు. దీంతో ఆంధ్రా - తెలంగాణ సరిహద్దులోని 100 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రయాణికులు 30 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. కట్టలేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో విద్యార్థులు 2 రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు.
గంపలగూడెంలోని తోటమూల-వినగడప గ్రామాల మధ్య కట్టలేరుపై వంతెన నిర్మాణ ప్రతిపాదన ఎన్నో ఏళ్లుగా మురిగిపోతుంది . దశాబ్దాలు గడుస్తున్నా వంతెన నిర్మాణం కార్యరూపం దాల్చడం లేదు. ఇక్కడ గతంలో తాత్కాలికంగా నిర్మించిన లోలెవెల్ కాజ్ వే 2018లో కుప్ప కూలింది. వంతెన నిర్మించేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఇంతలో ఎన్నికల కోడ్ రావడంతో 2019లో పనులకు అంతరాయం ఏర్పడింది. ఏటా వర్షాకాలంలో కట్టలేరు పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
No Bridge on Kattaleru Vagu : వర్షాకాలంలో 30 నుంచి 40 సమీప గ్రామాల ప్రజలతో పాటు తెలుగు రాష్ట్రాల మధ్య రాకపోకలకు తీవ్రఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఖమ్మం, భద్రాచలం, ఇతర ప్రాంతాల నుంచి ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు రావాలంటే ఈ మార్గమే ఆధారం. ఇటు విజయవాడ, నూజివీడు, చీమలపాడు వంటి ప్రాంతాలకు, అటు తిరువూరు, భద్రాచలం, కొత్తగూడెం, ఎ.కొండూరు వంటి ప్రాంతాలకు ఈ దారిలోనే రాకపోకలు జరుగుతుంటాయి.
హంద్రీ వంతెనపై భారీ గొయ్యి - వాహనదారులు ఆందోళన - Handri bridge
'లోలెవెల్ వంతెన ఆరేళ్ల క్రితం కూలిపోవడంతో పట్టించుకున్నవారు కరవయ్యారు. తాత్కలికంగా పలుమార్లు కట్లేరు వాగుపై అప్రోచ్ రహదారి నిర్మిస్తున్నప్పటికీ వర్షాలకు వాగు పొంగి కొట్టుకుపోతుంది. ప్రస్తుతం తాత్కాలిక రహదారిపైనే రాకపోకలు సాగిస్తున్నాము. ఈ దారి చిన్నగా ఉండటంతో వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటున్నాయి. గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ దారిలో గతంలో ఎన్నో వాహనాలు వాగులోకి బోల్తా కొట్టాయి. రాత్రయితే ప్రయాణం మరింత ప్రమాదభరితంగా మారుతోంది. ఓపక్క వాగు ఉండటంతో వర్షాకాలంలో భయం భయంగా రాకపోకలు సాగిస్తున్నాం. వరద తీవ్రమైతే తాత్కాలిక రహదారిపై వెళ్లే అవకాశమే లేదు. వంతెనకు అటు, ఇటు గంపలగూడెం-వినగడప మధ్య కిలోమీటర్ దూరం మాత్రమే ఉండగా వర్షం పడితే చుట్టూ తిరిగి రావడానికి 25 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ తక్షణం వంతెన నిర్మించి తమను ఈ గండం నుంచి గట్టెక్కించాలి.' -స్థానికులు, వాహనదారులు
రెండు రాష్ట్రాల పరిధిలోని వందలాది గ్రామాలను కలిపే వంతెనను నిర్మించడంలో జరుగుతోన్న జాప్యంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది మార్చిలో తిరువూరులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా కట్లేరు వంతెన నిర్మాణంపై హామీ ఇచ్చారు. ఇప్పటికీ అది హామీగానే మిగిలింది తప్ప అడుగు ముందుకు పడలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరుణంలో ఈ వంతెన నిర్మాణ పనులను వచ్చే డిసెంబరులో చేపట్టే అవకాశముందని స్థానిక ప్రజా ప్రతినిధులు భరోసా ఇస్తున్నారు.
కలసపాడు రహదారిపై కుంగిన కల్వర్టు- డ్రైవర్ చాకచక్యంతో తప్పిన ప్రమాదం