YSRCP neglected Mogali Gundala Reservoir Works Farmers Problems in Prakasam District: ఎన్నో ఏళ్లుగా అక్కడి రైతులకు ఎదురుచూపులే మిగిలాయి. నిధులు మంజూరై టెండర్లు పిలిచినా ప్రకాశం జిల్లా మొగలిగుండాల జలాశయం నిర్మాణానికి మోక్షం లభించలేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం జలాశయ నిర్మాణాన్ని పూర్తిగా అటకెక్కించేసింది. కరవు జిల్లాలో ఈ ప్రాజెక్టుతో సాగు, తాగునీటి ఇబ్బందులు తొలగిపోతాయని భావిస్తున్న రైతులకు కూటమి ప్రభుత్వం రాకతో ఆశలు చిగురించాయి.
ప్రకాశం జిల్లాలో రైతుల సుదీర్ఘ కల అయిన మొగలిగుండాల జలాశయం నిర్మాణానికి నోచుకోవడంలేదు. తాళ్లూరు, చీమకుర్తి మండలాల్లోని సుమారు 10 వేల ఎకరాలకు సాగునీటి అందించేలా, పలు గ్రామాలకు తాగునీరందేలా ఈ ప్రాజెక్టు నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. జలాశయం పూర్తయితే కొండవాగుల్లోంచి వచ్చే నీటి వనరులను నిల్వచేసి దిగువన ఉన్న పంట పొలాలకు సాగునీటిని అందించే అవకాశం ఉంది.
గత కొన్నేళ్లుగా జలాశయానికి ప్రతిపాదనలు చేయటం, నిధులు మంజూరు చేసి టెండర్లు పిలవటం శంకుస్థాపనలు చేయటంతోనే సరిపుచ్చుతున్నారు. టీడీపీ హయాంలో అప్పటి మంత్రి శిద్ధా రాఘవరావు రూ. 10 కోట్ల నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి శంకుస్థాపన చేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ రివర్స్ టెండరింగ్ విధానంతో మళ్లీ టెండర్లు పిలిచి పూర్తి చేయకుండానే వదిలేసింది.
'మెుగలిగుండాల జలాశయం వల్ల అన్నదాతలకు చాలా ఉపయోగం ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే సాగు, తాగు నీరు, భూగర్బ జలాలకు ఇబ్బంది ఉండదు. పది ఊళ్లకు నీరందుతుంది. గత వైఎస్సార్సీపీ నేతల హయాంలో కాంట్రాక్టర్లు ప్రాజెక్ట్ పనులను ముందుకు సాగనివ్వకపోగా, ఒక వైపు కట్ట ఇసుకను అంతా దోచుకున్నారు. వర్షాలు పడితే దాని వల్ల ఊరి గుడి కూడా ముంపునకు గురవుతుంది.'
- రైతులు
పెద్దిరెడ్డి స్వార్థానికి బలైన కదిరి రైతులు- అడుగంటిన చెర్లోపల్లి రిజర్వాయర్ - no Water in Cherlopalli Reservoir
వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ గుత్తేదారుడు మెుగలిగుండాల జలాశయం పనుల టెండర్ దక్కించుకున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయి, అగ్రిమెంట్ కుదుర్చుకున్నాక ఒక వైపు ఉన్న మట్టికట్టను తొలగించారు. నష్టం వస్తుందని భావించిన గుత్తేదారు మట్టికట్ట పునర్నిర్మాణం చేయకుండానే ఎక్కడి పనులు అక్కడ వదిలేసి చేతులు దులుపుకున్నారని రైతులు తెలిపారు. కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుని మెుగలిగుండాల జలాశయం నిర్మాణం పూర్తి చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.