YSRCP Leaders Set Fire to TDP Office: పల్నాడులో వైసీపీ శ్రేణుల ఆగడాలకు అంతేలేకుండాపోతోంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలోని తెలుగుదేశం కార్యాలయానికి వైసీపీ శ్రేణులు నిప్పుపెట్టడంతో పూర్తిగా దగ్ధమైంది. ఆదివారం రాత్రి నాగిరెడ్డిపాలెంలోని ఎస్టీ కాలనీలో నరసరావుపేట ఎంపీ కూటమి అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు తరఫున ఆయన సోదరి రుద్రమదేవి ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్డీఏ శ్రేణులతో కలిసి ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రధాన కూడలిలోని వైసీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు.
టీడీపీ కార్యకర్తలను దుర్భాషలాడారు. అవేమి పట్టించుకోని టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం వైసీపీ కార్యకర్తలు, నాయకులు టీడీపీ కార్యాలయం వద్దకు భారీగా తరలివచ్చి ప్రచార వాహనాలను రహదారికి అడ్డుగా ఉంచారు. ఇదేంటని ప్రశ్నించిన టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని టీడీపీ శ్రేణులను చెదరగొట్టారు. పోలీసుల తీరుపై కూటమి శ్రేణులు మండిపడ్డారు. అనంతరం రాత్రి తెలుగుదేశం కార్యాలయానికి వైసీపీ శ్రేణులు నిప్పుపెట్టారు.
Krosuru TDP office Set on Fire: మరోవైపు ఈ నెల 7వ తేదీన కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పల్నాడు జిల్లాలోని క్రోసూరులో తెలుగుదేశం కార్యాలయానికి 7వ తేదీన అర్ధరాత్రి నిప్పు పెట్టారు. కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ నాలుగురోడ్ల కూడలిలోని మన్నెం భూషయ్య కాంప్లెక్స్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించగా, కూటమి నేతలు సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఉండేందుకు తాటాకులతో పందిరి ఏర్పాటు చేశారు. అయిదే ఆ పందిరికి నిప్పటించారు.
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రజా గళం జరిగిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. క్రోసూరులో అగ్ని ప్రమాదం విషయం తెలిసిన వెంటనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. క్రోసూరులో ప్రజాగళం సభ విజయవంతం కావడంతో, ఓర్వలేక నిప్పు పెట్టారని టీడీపీ శ్రేణులు పేర్కొన్నారు. సమీపంలోనే అగ్నిమాపక కేంద్రం ఉన్నా, మంటలార్పడానికి ఆలస్యంగా వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అగ్నిమాపక యంత్రాన్ని వైసీపీ నేతలే అడ్డుకున్నారని ఆరోపించారు. తెలుగుదేశం కార్యకర్తలు ఆవేశంతో ఊగిపోతూ, సమీపంలోని వైసీపీ కార్యాలయం వైపు పరుగులు తీశారు. పరిస్థితి అదుపుతప్పుతుందని గ్రహించిన పోలీసులు టీడీపీ శ్రేణులను అడ్డుకున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలోని బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలెంలోని తెలుగుదేశం కార్యాలయానికి సైతం వైసీపీ శ్రేణులు నిప్పుపెట్టారు. దీంతో కొద్ది రోజుల్లోనే రెండు చోట్ల టీడీపీ కార్యాలయాలు దగ్ధమయ్యాయి.