YSRCP Leaders Land Encroachment in Dachepalli Constituency NTR District : అధికారం అండతో గత ఐదేళ్లలో వైఎస్సార్సీపీ నాయకులు అంతులేని భూ కబ్జాలకు పాల్పడ్డారు. పల్నాడు జిల్లా దాచేపల్లి నియోజకవర్గంలో అప్పటి ప్రజాప్రతినిధి అనుచరులు, బినామీలు రెవెన్యూ సిబ్బందితో కుమ్మకై వేలాది ఎకరాల భూములను తమ పేరిట ఎక్కించుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములు, అసైన్ ల్యాండ్స్, డీకే పట్టాలు, కొండ, బండ అనే తేడా లేకుండా ఆన్ లైన్ లో సర్వే నంబర్లకు సబ్ డివిజన్ చేయించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అధికారుల సహకారంతో జరిగిన భూ బాగోతంపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం సహజ సంపద అధికంగా ఉన్న ప్రభుత్వ భూములకు నెలవాలం. తెలంగాణతో సరిహద్దు, సిమెంట్ పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో ఈ ప్రాంతంలో స్థలాలకు మంచి డిమాండ్ ఉంది. గత ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ నాయకుల దృష్టి ఈ భూములపై పడింది. దాచేపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు పొందుగుల, రామాపురం, గామాలపాడు, పెదగార్లపాడు, తంగెడ వంటి గ్రామాల్లో అనువంశికం పేరిట ప్రభుత్వ భూములను రాయించుకున్నారు. కాసులకు కక్కుర్తి పడిన రెవెన్యూ సిబ్బంది నాయకుల అక్రమాలకు వంతపాడారు. భూ కుట్రలో భాగస్వామిగా ఉన్న ఓ రెవెన్యూ ఉద్యోగి కుమారుడు వెల్లడించిన వివరాలతో నాటి భూ ఆక్రమణలు భారీగా వెలుగులోకి వస్తున్నాయి.
'దాచేపల్లి మండలంలోని పొందుగల, రామాపురం, గామాలపాడులోని ప్రభుత్వ భూములను కొంతమంది వ్యక్తులు బినామీల పేరిట రాయించకున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు సైతం పొంది పలు బ్యాంకుల్లో రుణాలు పొందారు. సామాన్యులు అడంగల్ కోసం అధికారులను సంప్రదిస్తే ఆ పని నత్తనడకన సాగుతుంది. అధికారులు అసలు పట్టించుకునేవారు కాదు. కానీ వైఎస్సార్సీపీ నాయకులు, వారి బినామీలకు 24 గంటల్లో అడంగల్ చేతిలో పెట్టి పంపిస్తారు.' - నాగుల్ మీరా, డేటా ఆపరేటర్ దాచేపల్లి తహసీల్దార్ కార్యాలయం
మండలంలో వివిధ సర్వే నంబర్లలో ఉన్న 3,786 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నాయకులు అక్రమించుకున్నట్లు ఆరోపిస్తున్నారు. సర్కారీ భూమిని ప్రభుత్వ దస్త్రాలకు ఎక్కించే క్రమంలో గ్రామస్థాయి రెవెన్యూ ఉద్యోగి కుమారుడు ఒకరి నుంచి డబ్బులు వసూలు చేశారు. ఎంతకీ పని పూర్తి చేయకపోవడంతో సొమ్ములిచ్చిన వారు నిలదీశారు. ఈ విషయం రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాటి భూ అక్రమాల వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
వివాదాస్పద భూముల్లో వైఎస్సార్సీపీ నేతల లేఅవుట్లు- నోటీసులు జారీ - YSRCP Leaders Illegal Layouts