YSRCP Leaders Irregularities : విశాఖ జిల్లాలో విశాలమైన సముద్రతీరం అందమైన కొండలు, గుట్టలతో పర్యాటకంగా అలరాడే నియోజకవర్గమది. ఎర్రమట్టి దిబ్బలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధి కనుసన్నల్లోనే మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఆయన అనుచరులు గనులశాఖ నుంచి కొంతమేరే అనుమతులు తీసుకుని ఆ తర్వాత అందినకాడికి తవ్వేసుకుంటున్నారు. కాపులుప్పాడ, కె.నగరపాలెం, దాకమర్రి, కొత్తవలస, నేర్లవలస, అమనాం, చిప్పాడ కొండలు ఆ కీలక నేత ధాటికి కనుమరుగయ్యాయి. రాత్రికి రాత్రే భారీ యంత్రాలతో కొండలను పిండి చేసేస్తున్నారు. ఆనందపురం పరిధిలోని 52 కొండల్లో ప్రతి రోజూ ఎర్రమట్టి యథేచ్ఛగా తరలిపోతోంది. పద్మనాభం పరిధిలో బాంధేవీపురం పల్లికొండ ప్రాంతంలో నిత్యం గ్రావెల్ తవ్వకాలు సాగుతున్నాయి. కృష్ణాపురం, పాండ్రంగి పంచాయతీల్లో విస్తరించి ఉన్న సూది కొండలోనూ అడ్డగోలు తవ్వకాలు సాగిస్తున్నారు. నేరెళ్లవలస శివారులో మెట్ట నుంచి రాత్రి సమయాల్లో మట్టి తవ్వి తరలిస్తున్నారు. మట్టితోపాటు తీరప్రాతంలోని నల్ల ఇసుకను రాష్ట్రాలు దాటించేస్తున్నారు.
ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావుకు నిరసన సెగ- ప్రశ్నించిన వారిపై విరుచుకుపడిన వైనం
వైఎస్సార్సీపీ నేత అండ చూసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు చెలరేగిపోతున్నారు. 2015లో అడవివరంలో దేవస్థానానికి చెందిన 13 ఎకరాల భూమిని ఈ నేత సోదరుడు 33 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. ఆ భూమిలో ఓ స్కూలు నిర్మించి పక్కనే ఉన్న మరో 8 ఎకరాలు ఆక్రమించేశారు. ఈ స్కూల్‌కు వెళ్లడానికి రహదారి నిర్మాణం కోసం ఏకంగా రామన్న చెరువుకు నీరు వెళ్లే గెడ్డను పూడ్చేశారు. జగనన్న ఇళ్ల స్థలాలకు భూసేకరణ చేస్తారని తెలుసుకున్న నేత ముందుగానే నిడిగట్టు, రామజోగి అగ్రహారం, నేరెళ్లవలస, కాపులుప్పాడ పరిధిలో డి-పట్టా కలిగిన రైతుల నుంచి 40 ఎకరాలు ఈ నేత బలవంతంగా భూములు లాక్కొన్నారు. భూసేకరణలో భాగంగా వీఎమ్ఆర్డీ ఎకరాకు 900 చదరపు అడుగుల చొప్పున కేటాయించింది. ఆవిధంగా 36 వేల చదరపు అడుగుల భూమిని దక్కించుకుని అందులో వైద్య కళాశాల నిర్మించాలని పావులు కదిపారు. ప్రైవేట్ వెంచర్ల పంచాయితీల్లో తలదూర్చి కమీషన్ రూపంలో భారీగా దండుకుంటున్నారు. భీమిలి ప్రాంతంలో ఎక్కడ లే-అవుట్ వేసినా సదరు నేతకు కప్పం కట్టాల్సిందే.
ఓ ఫార్మా సంస్థను బెదిరిస్తూ భారీగానే డబ్బులు దండుకుంటున్నారు. ఫార్మా వ్యర్థాలు సముద్రంలో కలిసి మత్స్య సంపద దెబ్బతింటోందంటూ వారని బెదిరిస్తున్నారు. అలాగే తాను సూచించిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలంటూ షరతులు విధించారు. ఆ సంస్థలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వైసీపీ నేత కుటుంబ సభ్యులు దోచుకుంటున్నారు. విద్యుత్ సబ్‌స్టేషన్ షిఫ్టు ఆపరేటర్ల్ల పోస్టు కోసం ఒక్కొక్కరి నుంచి 7 లక్షల వరకు వసూలు చేశారు. కొత్త అంగన్‌వాడీ పోస్టులకు సైతం ఒక్కొక్కరి నుంచి 3 లక్షల చొప్పున వసూలు చేసి జేబులు నింపుకొన్నారు. జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికుల పోస్టులనూ వదలకుండా అమ్ముకున్నారు.
ప్రత్యర్థి పార్టీ నేతల బలహీనతలపై ఆరా తీసి వేధించి తమ పార్టీలో చేర్చుకోవడం ఆయనకు ఆనవాయితీ. టీడీపీ హయాంలో విశాఖ జిల్లా పశుసంవర్థక విభాగంలో కీలక పోస్టులో ఉన్ననాయకుడిని ఇలాగే పార్టీ మారే పరిస్థితి కల్పించారు. భీమిలి మున్సిపాలిటీలోనూ ఓ మహిళా నాయకురాలికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అధికార పార్టీ తీరుపై ఒక మాజీ ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేయగా ఆయన వద్ద ఉన్న భూములు లాక్కునేందుకు యత్నించారు. తెలుగుదేశానికి చెందిన సీనియర్ నేతలను వేధించి వైసీపీలో చేరేలా ఒత్తిళ్లు తీసుకొచ్చారు.
ప్రతిపక్ష నేతలే కాదు ఆయన ధాటికి సొంత పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు కూడా విలవిల్లాడుతున్నారు. నోటిదురుసు ఎక్కువ అని అధికారవర్గాల్లో ఆయనకు పేరు ఉంది. అధికారులను సైతం కించపరిచేలా మాట్లాడతారని పోలీసులు చెప్పుకుంటున్నారు. మత్స్యశాఖ అధికారిణి గురించి ఈ నాయకుడు మాట్లాడిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. అయ్యప్ప మాలధారణలో ఉన్న ఒక ఎంపీడీవోను కూడా ఇటీవల తిడుతూ విరుచుకుపడటం వివాదాస్పదమైంది. అధికారులతోపాటు పార్టీ మండల స్థాయి నాయకులు కూడా ఈ నేత వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్నారు.