Vijayasai Reddy Negligence on Own Village Development : రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత ఆయన. కేంద్రంలోనూ వైఎస్సార్సీపీ తరఫున చక్రం తిప్పే వ్యక్తిగా పేరు. కానీ అధికారాన్ని మాత్రం సొంత పనులు చక్కబెట్టుకోవడానికే వాడుకున్నారు. కనీసం సొంతూరినీ పట్టించుకోలేదు. ఐదేళ్ల క్రితం స్మార్ట్ విలేజ్‌గా మారుస్తానని బీరాలు పలికిన ఆయన ఊరిలో ఒక్క పనీ చేయలేదు. ఇప్పుడు అధికార పార్టీ తరఫున నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డి ఇక తమ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయగలరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఏంపీ అభ్యర్థిగా బరి నిలిచిన విజయసాయిరెడ్డి స్వగ్రామాన్ని విస్మరించారు. ఐదేళ్ల కిందట ఊరిని దత్తత తీసుకున్నానని స్మార్ట్ విలేజ్‌గా మారుస్తానని ఘనంగా ప్రకటించారు. విజయసాయిరెడ్డి ప్రకటనతో ఊరి ముఖ చిత్రం మారుతుందని స్థానికులంతా సంతోషించారు. కానీ ఐదేళ్లుగా ఊరు మారలేదు. ఎన్నికలకు ముందు చుట్టంచూపుగా స్వగ్రామానికి వచ్చి పోయే విజయసాయిరెడ్డి గ్రామాన్ని స్మార్ట్ విలేజ్‌గా చేస్తానని ఘనంగా ప్రకటించారు. అయితే స్మార్ట్ విలేజ్ సంగతి దేవుడికెరుకగాని, కనీసం తాగే నీటి కోసం ఇబ్బంది పడాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్మార్ట్ విలేజ్ కోసం గతంలో కేటాయించిన 13 కోట్లకు పైగా నిధులతో అరకొర సిమెంట్ రోడ్లు, కాలువలు నిర్మించారే తప్ప మిగిలిన నిధులు ఎటుపోయాయో తెలియడం లేదని చెబుతున్నారు.
కాలవలు, రోడ్లు కూడా నాశరకంగా నిర్మించి చేతులు దులుపుకున్నారు. 24 గంటలు కరెంట్ అందిస్తానని, రహదారులు వెడల్పు చేయిస్తామని, సెంట్రల్ లైటింగ్ వేస్తామని, పశువుల ఆసుపత్రి నిర్మిస్తామని, పార్క్ ఏర్పాటు చేయిస్తామని వాగ్దానం చేసిన విజయసాయిరెడ్డి ఏ ఒక్కటి పూర్తి చెయ్యలేదు. ధర్మల్ ప్లాంట్ల బూడిదతో గ్రామస్ధులు ఇబ్బంది పడుతున్న నివారణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. గ్రామంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ ఉన్నా, ఇక్కడ నీరు తాగేందుకు పనికిరాక పోవడంతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. వాగ్దానం చేసిన విజయసాయిరెడ్డి ఏ ఒక్కటీ పూర్తి చెయ్యలేదు. గ్రామ అభివృద్ధికి ఆయన పైసా కూడా ఖర్చు పెట్టలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఊరిలో కనీసం తాగేందుకు మంచి నీరు కూడా రావడం లేదని స్థానికులు వాపోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన మినరల్ ప్లాంటే తమ గ్రామానికి దిక్కని చెబుతున్నారు. ఐదేళ్లుగా సొంత ఊరిని పట్టించుకోని విజయసాయిరెడ్డి నెల్లూరు పార్లమెంట్‌లోని 7 నియోజకవర్గాలను ఏలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ధర్మల్ ప్లాంట్ల బూడిదతో గ్రామం ఇబ్బందిపడుతున్నా కనీసం కన్నెత్తి చూడలేదని వాపోతున్నారు.
విజయసాయి రెడ్డికి ఓటేస్తే నెల్లూరు పార్లమెంట్ అభివృద్ధి తాళ్లపూడిలా మారుతుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.