YSRCP Leader Jogi Ramesh Illegally Occupied Land : అధికారాన్ని అడ్డుపెట్టుకుని మాజీ మంత్రి జోగి రమేశ్ చేసిన భూ కబ్జాల్లో ఒకటి దుమారం రేపుతోంది. విజయవాడ గ్రామీణ మండలం అంబాపురం గ్రామంలో రీ సర్వేనెంబరు 87లో అవ్వా వెంకట శేషునారాయణరావుతో పాటు, వారి బంధువులకు భూములున్నాయి. వారు అగ్రిగోల్డ్ కంపెనీలో భాగస్వాములుగా ఉన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను జప్తులో భాగంగా 2019లో నాటి ప్రభుత్వం రీసర్వే నెంబరు 87లోని 2293గజాల స్థలాన్ని జప్తు చేసింది.
ఈ భూములు విజయవాడకు సమీపంలో ఉండడం, ఖాళీగా ఉండడంతో వీటిని కబ్జాకు తెరలేచింది. అంబాపురం గ్రామంలోనే రీసర్వే నెంబరు 88లో పోలవరపు మురళీమోహన్ అనే వ్యక్తి నుంచి మాజీ మంత్రి తనయుడు జోగి రాజీవ్ 1074 గజాలు, ఆయన బాబాయ్ జోగి వెంకటేశ్వరావు 1086 గజాలు కొన్నారు. 2022 నాటి రిజిస్ట్రేషన్ దస్తావేజుల్లో సర్వే నెంబరు 88 అని స్పష్టంగా ఉంది. కానీ, తమ దస్తావేజుల్లో సర్వే నెంబరు తప్పుగా నమోదైందని నాటకానికి తెరలేపారు. రీసర్వే నెంబరు 87కు బదులుగా రీసర్వే నెంబరు 88 నమోదైందని దరఖాస్తు చేశారు.
జోగి రమేష్ ఇసుక అక్రమ తవ్వకాలను అధికారులు పట్టించుకోవట్లేదు : బోడె ప్రసాద్
అప్పటికే జోగి రమేశ్ మంత్రిగా ఉండటంతో అధికారులు ఏమాత్రం విచారణ లేకుండా స్వీయ సవరణ ద్వారా దస్తావేజుల్లో సర్వే నెంబరు మార్చారు. వాస్తవానికి అగ్రిగోల్డ్ జప్తు చేసిన భూముల్ని ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చింది. అంటే, వాటిని రిజిస్టర్ చేసే అవకాశమే లేదు. కానీ జోగి రమేశ్‌పై భయభక్తులతో సవరణ దస్తావేజులు జారీ చేసేశారు. వాటిని అడ్డుపెట్టుకుని జోగి మనుషులు అగ్రిగోల్డ్‌కు చెందిన రీసర్వే నంబర్ 87 భూముల స్వాధీనానికి వెళ్లారు. అప్పట్లో వాస్తవ యజమాని అభ్యంతరం కూడా పెట్టారు. ఐతే జోగి రమేశ్ తహశీల్దారు ద్వారా 2023లో సదరు భూమి స్వాధీన ఉత్తర్వులు పొందారు. ఈ లేఖలతో అగ్రిగోల్డ్ భూమిని స్వాధీనం చేసుకున్న జోగి కుటుంబం దాని చుట్టూ ప్రహరీ నిర్మించేసుకుంది.
అడ్డదారిలో స్వాధీనం చేసుకున్న భూమిని జోగి కుటుంబం వెంటనే వేరొకరికి అంటగట్టింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పడిగపాటి చైతన్య రెడ్డి బందువులకు 2023 మే నెలలో విక్రయించారు. వాస్తవ యజమానులు దీనిపై విజయవాడ రెండో పట్టణ పోలీసు స్టేషన్‌లో 2024 జనవరిలో ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదుపై సర్వే చేసి వాస్తవ వివరాలు తెలపాలని అప్పటి ఎస్‌ఐ విజయవాడ గ్రామీణ తహశీల్దారుకు 2024, జనవరి 20న లేఖ రాశారు. నాటి తహశీల్దారు జాహ్నవి కూడా 2024 మార్చి 30న పోలీసులకు పోస్టులో నివేదిక పంపారు. కానీ, ఇప్పటి వరకూ పోలీసులు దాన్ని తెరిచి చూడలేదు. ఎన్నికల ముందు వరకూ మంత్రిగా ఉన్న జోగి రమేశ్ ఆ నివేదికను తొక్కిపెట్టారని తెలుస్తోంది.
22.24 ఎకరాల చెరువు భూమి కబ్జా - గ్రామస్థుల ఆందోళన - Illegal Registration of Pond Land