YSRCP Illegal Election Campaign: సార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ వైఎస్సార్సీపీ నాయకులు బరితెగించారు. ఇంటింటికీ వంట కుక్కర్లు పంపిణీ చేస్తున్నవారు కొందరైతే, వివిధ కుల, మత సంఘాల ప్రతినిధులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాల ద్వారా వైెస్సార్సీపీ చిహ్నాల సంచితో 2వేల రూపాయల నగదు, ఒక కుక్కర్ సెట్, ఫ్లాస్క్ వంటి కానుకలతో నింపేసి మరికొందరు సరఫరా చేస్తున్నారు. ప్రాంతాల వారీగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లతో పరిచయ కార్యక్రమాల పేరిట సమావేశాలు నిర్వహిస్తూ బహుమతులు అందిస్తున్నారు. ముందస్తుగానే ఓట్ల కొనుగోలును వైఎస్సార్సీపీ నేతలు మొదలుపెట్టేశారు. ఓటర్లకు నగదు, కానుకలు పంపిణీ చేయడమంటే ఓట్ల కొనుగోలు కిందే లెక్క.
ప్రజాప్రాతినిధ్య చట్టం - 1951లోని సెక్షన్ 123 (1) ప్రకారం ఇది తీవ్రమైన నేరం. ప్రభుత్వ ఉద్యోగులకు నాయకులు కానుకలు ఇవ్వడం, అధికారులు వాటిని తీసుకోవడం లంచమే అవుతుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్-7తో పాటు, ఐపీసీలోని 171-B, 171-E ప్రకారం ఇది నేరం. ఓటర్లకు నగదు, తాయిలాలు, ప్రభుత్వ ఉద్యోగులకు కానుకలు పంపిణీ చేస్తున్న ఘటనలపై వార్తలు, వాటి వీడియోలు, ఫొటోలు విస్తృతంగా తిరుగుతున్నా వైఎస్సార్సీపీ నాయకులపై ఎన్నికల సంఘం ఎందుకు కేసులు నమోదు చేయడం లేదు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల నుంచి విలువైన కానుకలు స్వీకరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపై సర్వీసు ప్రవర్తన నియమావళి ప్రకారం విచారణ జరిపేందుకు కూడా ఆస్కారం ఉంది.
వైసీపీ ఎన్నికల ప్రచారానికి పరాకాష్ట - ఆటోలకు 'సిద్ధం' ఫ్లెక్సీలు
వైఎస్‌ఆర్ ఆసరా పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చెక్కుల పంపిణీ పేరిట వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతి మండలంలో సభలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ సొమ్ముతో నిర్వహిస్తున్న ఈ సభలు, వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార సభల్లా జరుగుతున్నాయి. సభా ప్రాంగణమంతా వైఎస్సార్సీపీ జెండాలు, తోరణాలు, కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలతో నింపేస్తున్నారు. తమ పార్టీ గుర్తైన ఫ్యాన్‌కే ఓటు వేయాలంటూ హాజరైన మహిళలతో ప్రతిజ్ఞలు చేయిస్తున్నారు.
గత ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకు రుణాలు ఇవ్వలేదని, వైఎస్సార్సీపీ పాలనలోనే అన్నీ ఇస్తున్నామంటూ అధికారులతో చెప్పిస్తున్నారు. సభకు హాజరైన వారందరికీ జగన్ ఫొటో, స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే లేదా ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఫొటో అందిస్తున్నారు. ఇది ప్రభుత్వ సొమ్ముతో పార్టీకి ఎన్నికల ప్రచారమే అవుతుంది.
నారా లోకేశ్ శంఖారావం - ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం
అధికార వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను వేరే నియోజకవర్గాలకు మార్చింది. నియోజకవర్గాలకు కొత్తగా వెళ్లిన నాయకులు, తమ ఉనికిని చాటు కునేందుకు ఓటర్లకు నగదు, కానుకలు పంపిణీ చేస్తున్నారు. స్వయం శక్తి సంఘాల మహిళా గ్రూపులను పర్యవేక్షించే రిసోర్స్ పర్సన్లను, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను, వాలంటీర్లను కానుకలతో ప్రలోభపెడుతున్నారు.
చంద్రగిరి నుంచి పెనమలూరు వరకూ అనేక నియోజకవర్గాల్లో ఇదే తంతు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, రానున్న ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన అక్కడి వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
వారందరికీ కుక్కర్లు పంపిణీ చేస్తున్నారు. స్వయంశక్తి సంఘాల మహిళా గ్రూపులను పర్యవేక్షించే రిసోర్స్ పర్సన్లకు కుక్కర్లు, చీరలు పంపిణీ చేశారు. ఈ-వ్యాలెట్‌ల ద్వారా వాలంటీర్ల ఖాతాలకు డబ్బులు పంపిస్తున్నారు. చంద్రగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సంక్రాంతి కానుకల పేరిట నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ కుక్కర్లు పంపిణీ చేశారు. వాటిపై సీఎం జగన్ ఫొటో, తన ఫొటోతో పాటు తన కుమారుడు మోహిత్‌రెడ్డి ఫొటో ముద్రించారు.
పుట్టుకతో క్రైస్తవులమైన మనమంతా యేసు బిడ్డ జగన్‌ను మరొకసారి ముఖ్యమంత్రిగా, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలంటూ మంత్రి జోగి రమేశ్ పాస్టర్లను, దైవ సహాయకులను తాజాగా కోరారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకి ఎల్. ఎన్ గార్డెన్స్‌లో దైవసేవకుల ఆత్మీయ సమావేశం పేరిట ఈ మేరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
జనం సొమ్ముతో జగన్ ఎన్నికల ప్రచారం: శ్రీనివాసరావు
గడపగడపకు తిరిగి ప్రభుత్వం ద్వారా అందుతున్న సహాయాన్ని వివరించాలని పాస్టర్లకు పిలుపునిచ్చారు. తన విజయానికి వారితో ప్రార్థనలు చేయించారు. సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికీ కుక్కర్, ఫ్లాస్క్, 2వేలు రూపాయలు కలిపి తన ఫొటో, ఫ్యాన్ గుర్తు ఉన్న సంచిలో పెట్టి అందించారు. ఇది తీవ్రమైన నేరం. ఐపీసీ సెక్షన్ 171-C, 171-F కింద ఈ ఘటనలపై కేసు నమోదు చేయాలి. మతపరమైన అంశాలతో ప్రచారం చేసినందుకు ఆయన్ను ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలి.
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో 1995లో జరిగిన ఎన్నికల్లో శ్రీకృష్ణుడి బొమ్మతో ఎన్నికల ప్రచారం నిర్వహించినందుకు కలమట మోహనరావు ఎన్నిక చెల్లదని అప్పట్లో న్యాయస్థానం ప్రకటించింది. తర్వాత ఉప ఎన్నికల్లో ఆయన్ను పోటీకి అనర్హుడిగా ప్రకటించింది. ఇప్పటికైనా ఎన్నికల సంఘం స్పందించి మతం ఆధారంగా జోగి రమేశ్ చేస్తున్న ఎన్నికల ప్రచారంపై చర్యలు తీసుకోవాలి.
ఎట్టి పరిస్థితుల్లోనూ వాలంటీర్లకు ఎన్నికల విధులు అప్పగించొద్దు: ఈసీ
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడా డబ్బు తరలింపు, పంపిణీకి అవకాశం లేకుండా విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని సీఈసీ రాజీవ్‌కుమార్ జనవరి 10న విజయవాడలో నిర్వహించిన సమావేశంలో వివిధ విభాగాల అధికారులను ఆదేశించారు. అక్రమంగా జరిగే నగదు బదిలీలపై గట్టి నిఘా ఉంచాలని, ముఖ్యంగా ఆన్‌లైన్ వ్యాలెట్స్‌పై ఫోకస్ చేయాలన్నారు.
డబ్బు, మద్యంతో పాటు ఓటర్లను ప్రలోభపరిచేందుకు పంపిణీ చేసే అవకాశమున్న వస్తువులను, వాటిని నిల్వ చేసే గోదాములు, ప్రాంతాలను గుర్తించి దాడులు చేయాలంటూ ఇంత స్పష్టంగా ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశించినా, అధికారపార్టీ నాయకుల ప్రలోభాలను ఎన్నికల సంఘం సహా ఎవరూ ఎందుకు అడ్డుకోవట్లేదు.
కానుకల పంపిణీ ఉద్ధృతంగా సాగుతున్నా ఎందుకు నియంత్రించట్లేదు. ఇది అధికార పార్టీకి కొమ్ముకాయటం కాకపోతే మరేంటి. ఓట్ల కొనుగోలుపై చర్యలు తీసుకునే అధికారం జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లకు ఉంటుంది. అయినా వారు తమకేమీ కనపడనట్లు నటిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అవిగో ఎన్నికలు - ఇవిగో దొంగ ఓట్లు 'సమయం దగ్గరపడుతున్నా ఓటర్ల జాబితాలో తప్పులు'