YSRCP Government Release Funds : "ప్రాధాన్య రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా నిధుల లోటు రాకుండా, చెల్లింపుల సమస్య లేకుండా చూస్తూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను పూర్తి చేస్తున్నాం." 2022 జూన్ 21న అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలివి. వీటిని నమ్మితే రాష్ట్రంలో రహదారులన్నీ మిలమిలా మెరిసిపోతుంటాయని, ఎక్కడా మచ్చుకైనా గుంత అనేది కనిపించదేమో అనిపిస్తుంది. కానీ రోడ్డెక్కితే వాస్తవ పరిస్థితి ఇలా ఉంది.
Worst Roads in AP : వర్షాలు, తుపాన్లతో రహదారులపై ఏర్పడిన గుంతలను కూడా పూడ్చలేని చేతకానితనంతో జగన్ ప్రభుత్వం చేతులెత్తేస్తోంది. గుంతల మయంగా మారిన రోడ్లపై ప్రయాణిస్తూ ప్రజలు ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్నారు. ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు నుంచి కర్నూలు వెళ్లే ఈ రాష్ట్ర రహదారిని చూస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థమవుతుంది.
Andhra Pradesh Roads Situation : అధికారిక గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో 9 వేల కిలోమీటర్ల మేర రోడ్లు అత్యంత ఘోరంగా దెబ్బతిన్నాయి. మరో 7వేల 600 కిలోమీటర్ల మేర అధ్వానంగా ఉన్నాయి. వీటిని తక్షణం మరమ్మతు చేయాల్సి ఉంది. ఇవి చాలవన్నట్లు డిసెంబరులో మిగ్‌జామ్ తుపాను కారణంగా మరో 5 వేల కిలోమీటర్ల పొడవున కొత్తగా దెబ్బతిన్నాయి. తుపానుతో పాడైన రోడ్ల తాత్కాలిక మరమ్మతులకే 300 కోట్లు అవసరం అవుతుందని లెక్కతేల్చారు. వీటి శాశ్వత పనులు, వంతెనలు, కల్వర్టుల పునర్నిర్మాణానికి 2వేల 700 వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఈ రోడ్ల గుంతలు పూడ్చాలంటూ ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు పదేపదే కోరుతున్నాసరే గుత్తేదారులు ముందుకురావడం లేదు. నెల్లూరు - పొదలకూరు నుంచి సైదాపురం వెళ్లే రహదారిని ఇలానే ప్రభుత్వం నిధులు చెల్లించకపోవడంతో గుత్తేదారు మధ్యలోనే వదిలేశారు.
అడుగుకో గుంతతో ప్రజల పాట్లు - అధ్వానంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రోడ్లు
Funds Released to Roads : రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ అత్యంత ఘోరంగా ఉన్న రోడ్లను ఐప్యాక్ బృందం ద్వారా ప్రభుత్వం గుర్తించింది. వీటికి అత్యంత ప్రాధాన్యమున్న-హై ఇంపాక్ట్ రోడ్స్‌గా పేరు పెట్టుకుంది. వీటిని ఇప్పటికిప్పుడు బాగుచేయించకుంటే ఆ ప్రభావం వచ్చే ఎన్నికల్లో ఓట్లపై పడే ప్రమాదముందని సీఎం జగన్‌కు నివేదిక అందింది. అందుకే 3వేల 432 కిలోమీటర్ల పొడవున ఉన్న 437 రోడ్లను 1,121 కోట్లతో పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం 2023 జులై 5న పరిపాలన అనుమతులు ఇచ్చింది. నాటి నుంచి ఈ పనులకు మూడు, నాలుగు దఫాలుగా టెండర్లు పిలుస్తూనే ఉన్నారు. అయినా, ఇంకా 15 పనులకు బిడ్లు దాఖలు కావడంలేదంటేనే ప్రభుత్వంపై గుత్తేదారులు ఎంత అపనమ్మకంతో ఉన్నారో అర్థమవుతోంది.
మిగిలిన రోడ్ల పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సైతం గత నాలుగైదు నెలలుగా ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు రాలేదు. ఇటీవలే కొందరితో ఒప్పందాలు చేసుకున్న అధికారులు రాయలసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని ఒకట్రెండు చోట్ల పనులు ప్రారంభమయ్యేలా చూశారు. అయితే దీనికి ఆయా గుత్తేదారులు షరతు పెట్టారు. ఒకటికి మించి రోడ్ల పనులు దక్కించుకున్న గుత్తేదారులు తొలుత ఒక్క రహదారి పని చేస్తామని, దానికి చెల్లింపులు చేశాకే, మరొక రహదారిపై దృష్టిపెడతామని తెగేసి చెప్పారు. నాబార్డు నుంచి తీసుకున్న 351 కోట్ల రుణం, రాష్ట్ర విపత్తు నివారణ నిధి నుంచి తీసుకోనున్న 770 కోట్లతో తప్పకుండా చెల్లింపులు చేస్తామని అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సొమ్ములను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించకుండా, నేరుగా చెల్లింపులు చేస్తుందనే నమ్మకంలేదని గుత్తేదారులు పేర్కొంటున్నారు.
అధ్వానంగా ఏలూరు - కైకలూరు ప్రధాన రహదారి
రెండేళ్లలో రహదారుల విస్తరణ, పునరుద్ధరణ పనులు చేసిన గుత్తేదారులకు 500 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది. మరో 600 కోట్ల విలువైన పనుల బిల్లులను అప్‌లోడ్ చేసేందుకు ఆర్థికశాఖ అనుమతించడం లేదు. ఇక వర్షాలకు ఏర్పడిన గుంతలు పూడ్చటం, దెబ్బతిన్న కల్వర్టులు బాగుచేయడం, జంగిల్ క్లియరెన్స్ వంటి వార్షిక నిర్వహణ పనులు చేసిన చిన్న గుత్తేదారులకు చెల్లించాల్సిన బకాయిలు 160 కోట్లుపైనే. అన్నీ కలిపి 1,260 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. ఇవన్నీ 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో చేసిన పనులకు చెందినవే. పెండింగ్ బిల్లుల కారణంగానే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నుంచి గొట్టిపాడు అక్కడి నుంచి ఉన్నవ వెళ్లే రెండు రహదారుల పనులు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే మేకతోటి సుచరిత శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినా నిధులు రాక కాంట్రాక్టర్ మధ్యలోనే ఆపేశారు.
రాష్ట్రమంతటా గుత్తేదారులకు బకాయిలు ఇలా ఉంటే పులివెందుల, డోన్ నియోజకవర్గాలు మాత్రం ప్రత్యేకం అన్నట్లుగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది. సీఎం జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని గుత్తేదారులకు గత మూడు నెలల్లో 200 కోట్ల మేర బిల్లులు చెల్లించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి నియోజకవర్గమైన డోన్ పరిధిలోని గుత్తేదారులకు 100 కోట్ల వరకు ఇచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి, ప్రభుత్వంలో నంబర్ టూ స్థానంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి చెందిన పీఎల్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్‌కు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్ రోడ్ల పనులకు సంబంధించిన 75 కోట్ల మేర బిల్లులు ఇచ్చారు.
ప్రజాప్రతినిధులు ఒత్తిళ్లకు గుత్తేదారులు లొంగడం లేదు. అధికారుల అభ్యర్థనలకూ కరగడం లేదు. ప్రస్తుత సమయంలో రోడ్ల పనులు చేశాక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేస్తే తాము రోడ్డున పడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రహదారుల ప్రాజెక్టును గాలికొదిలేసిన సర్కారు - రుణాలు ఆపేస్తామని కేంద్రం, ఎన్డీబీ హెచ్చరిక