YSRCP Government Negligence on YSR Sunna Vaddi Scheme : రైతన్నకు ఎంత చేసినా తక్కువే. మూడున్నరేళ్లుగా ప్రతి అడుగులోనూ అన్నదాతలకు తోడుగా నిలిచి మేలు చేస్తున్నాం. క్రమం తప్పకుండా సున్నావడ్డీ రాయితీ ఇస్తున్నాం. 2022 నవంబరు 28న సున్నా వడ్డీ పంట రుణాలకు వడ్డీ రాయితీ చెల్లింపులకు బటన్ నొక్కుతూ సీఎం జగన్ చెప్పిన మాటలివి. వైఎస్సార్సీపీది మాటల ప్రభుత్వమే చేతల ప్రభుత్వం కాదని ప్రతిపక్షాలు చేసే విమర్శలను నిజం చేస్తూ సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ చెల్లింపుల్లో ప్రభుత్వం తీవ్ర ఆలసత్వం చూపుతోంది. 2020-21 ఖరీఫ్, రబీ సీజన్లలో లక్షలోపు పంట రుణాలు తీసుకున్న రైతులకు వడ్డీ రాయితీలను చెల్లించిన వైఎస్సార్సీపీది సర్కార్ 2021-22 రబీ, 2022 ఖరీఫ్, 2022-23 రబీ సీజన్లకు సంబంధించి రైతులకు వడ్డీ రాయితీ ఇంత వరకు ఇవ్వలేదు. 2023 నవంబరులోనే పంట రుణాలపై వడ్డీ రాయితీ ఇస్తామని సంక్షేమ క్యాలెండర్‌లో ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు పైసా కూడా ఇవ్వలేదు.
సున్నా వడ్డీ పథకాన్ని మరిచిన జగన్ : ఉమ్మడి గుంటూరు జిల్లాలో 54 వేల మంది రైతులు రాయితీ కోసం ఎదురుచూస్తున్నారు. రైతులు తీసుకున్న పంట రుణాలపై పూర్తిగా వడ్డీ మాఫీ చేయడం సున్నా వడ్డీ పథకం ముఖ్య ఉద్దేశ్యం. 2020లో సున్నా వడ్డీ పథకం ప్రారంభించిన సీఎం జగన్ రెండేళ్లు హడావుడి చేశారు. మూడో ఏడాది నుంచి సక్రమంగా చెల్లింపులు జరగడం లేదు. నాలుగో ఏడాది అసలు నిధుల విడుదల ప్రస్తావనే లేకుండా పోయింది. ప్రభుత్వం వడ్డీ మాఫీ చేస్తుందనే ఆశతో పంటలు పండినా, పండకపోయినా అప్పులు చేసి మరీ రైతులు బ్యాంకుల్లో రుణాలు చెల్లిస్తున్నారు. గుంటూరు జిల్లాలో 12 వేల మందికిపైగా, పల్నాడు జిల్లాలో 23 వేల మందికిపైగా, బాపట్ల జిల్లాలో 18 వేల మంది తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించారు.
అధికారంలోకి రాకముందు డాంబికాలు - నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీని పెంచని వైసీపీ ప్రభుత్వం
జమ కానీ రాయితీ డబ్బులు : ఖరీఫ్ సీజన్ ముగిసినా రైతులఖాతాల్లో ఇంతవరకూ సున్నా వడ్డీ రాయితీ డబ్బులు జమ కాలేదు. 2022-23 ఖరీఫ్ సీజన్‌కు గుంటూరు జిల్లా రైతులకు 3కోట్ల 40 లక్షలు చెల్లించాల్సి ఉండగా పల్నాడు జిల్లా రైతులకు 7 కోట్ల 19 లక్షలు బకాయిలున్నాయి. బాపట్ల జిల్లాలో 5 కోట్ల 20 లక్షలు రూపాయలు అన్నదాతలకు అందాల్సి ఉంది.
బలవన్మరణాలకు పాల్పడున్న అన్నదాతలు : గతంలో లక్షలోపు పంట రుణాలకు రైతులు వడ్డీ కట్టే అవసరం ఉండేది కాదు. అయితే జగన్ సర్కార్ వచ్చాక వడ్డీతో సహా సరిగ్గా ఏడాదిలోపు చెల్లించాలని షరతు పెట్టింది. అసలు, వడ్డీ చెల్లించి ఏడాది గడిచినా వడ్డీ రాయితీ సొమ్ము రైతులకు తిరిగి చెల్లించలేదు. చంద్రబాబు హయాంలో లక్ష వరకు వడ్డీ లేని రుణం, లక్ష నుంచి 3 లక్షల రూపాయల వరకు పావలా వడ్డీ రుణం రైతులకు వర్తించేవి. జగన్ సర్కారు వచ్చాక పావలా వడ్డీ రుణాలకు స్వస్తి పలికారు. రైతులు లక్షపైన రుణం తీసుకుంటే 7శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. చాలామంది రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంటలు వేస్తే, పెట్టుబడులకు సొమ్ము చాలక, ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీకి అప్పులు చేయాల్సి వస్తోంది. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో పంట సరిగ్గా చేతికి రాక నష్టపోయిన రైతులు, కౌలుసాగుదారులు అనేక మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు.
స్పందన కరవు : రైతులకు చెల్లించాల్సిన సున్నా వడ్డీ నిధులకు సంబంధించిన అర్హుల జాబితా పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపినా నిధుల విడుదలకు సంబంధించి ఎలాంటి కదలిక లేదని అధికారులు చెబుతున్నారు.