YSRCP Government Negligence : ఆరోగ్యశ్రీ జపం చేసే ముఖ్యమంత్రి జగన్ సర్కార్ వైద్యసేవలు అందించే అనుబంధ ఆసుపత్రులకు 12 వందల కోట్ల రూపాయల వరకూ బిల్లులు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని సకాలంలో చెల్లించాలని, ప్యాకేజీ ధరలు పెంచాలని ఎంత మొరపెట్టుకున్నా, సేవలు నిలిపేస్తామని హెచ్చరిస్తున్నా ప్రభుత్వం బెదిరింపులతో నోళ్లు మూయించాలని చూస్తుందే గానీ, ఇవిగో మీ బిల్లులు అని వాళ్లకు అభయం ఇవ్వడంలేదు. కేవలం ఆరోగ్యశ్రీ వైద్య సేవలపైనే మనుగడ సాగించే కొన్ని ఆస్పత్రులకు నిర్వహణ భారంగా పరిణమిస్తోంది. ఆ ప్రభావం రోగులపై పడుతోంది. కానీ జగన్ మాత్రం ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ వార్షిక చికిత్స పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచామంటూ ప్రచారంలో తరిస్తున్నారు. ఇవ్వని బిల్లులకు ఎన్ని లక్షలు చేస్తే ఏం లాభం అన్నది నెట్‌వర్క్ ఆస్పత్రుల ప్రశ్న.
బిల్లులు చెల్లించడానికి నిధులు, రోగులకు సంబంధించిన కేస్‌షీట్లు సత్వరం నిశితంగా పరిశీలించేందుకు వైద్యులు అందుబాటులో ఉండాలి. కానీ ఆ రెండూ అవసరమైన లేవు. కేస్ షీట్లు ఎక్కువగా ఉండటం, వాటిని పరిశీలించాల్సిన వైద్యులు తక్కువగా ఉండటం వల్లే చెల్లింపుల్లో ఆలస్యమవుతోంది. సర్జికల్ ఆంకాలజీకి సంబంధించిన 4 వేల 797 కేస్‌షీట్లు గత అక్టోబర్ నుంచి పరిశీలనకు నోచుకోవడం లేదు. 57 వేల 479 ఆఫ్తాల్మాలజీ సంబంధిత కేస్‌షీట్లు గత నవంబర్ 3వ తేదీ నుంచి, కార్డియాలజీ, కార్డియోథోరాసిక్‌కు చెందిన 3 వేల 29 కేస్‌షీట్లు నవంబర్ 13 నుంచి పెండింగులో ఉన్నాయి. వీటి పరిశీలనకు వివిధ స్పెషాలిటీల్లో కలిపి 60 మంది వైద్యనిపుణుల అవసరం ఉండగా 31 మంది మాత్రమే ఉన్నారు. ఇది జాప్యానికి ప్రధాన కారణమవుతోంది. ప్రస్తుత అవసరాల మేరకు వెంటనే 50 మంది వైద్యులను నియమించాల్సి ఉంది.
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులతో ప్రభుత్వం చర్చలు విఫలం- సేవలు నిలిపివేత
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ -కాగ్ కూడా ఆరోగ్యశ్రీ బకాయిల్ని తన నివేదికలో వివరంగా పేర్కొంది. 2019 జనవరి నుంచి 2021 మార్చి వరకూ రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల 16 వేల 317 క్లెయిమ్స్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయానికి రాగా అందులో 9 లక్షల 24 వేల 578 క్లెయిమ్స్ చెల్లింపుల్లో జాప్యం జరిగిందని కాగ్ గుర్తించింది. వాటి విలువ 2 వేల 62 కోట్ల 87 లక్షల రూపాయలని పేర్కొంది. అందులో అనుబంధ ఆసుపత్రులకే సగానికిపైగా బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఆరోగ్యశ్రీ ట్రస్టు తక్షణ అవసరాలకు మరికొన్ని నిధులు కావాల్సి ఉంది. ఈ ట్రస్టు పరిధిలోని 108, 104 సర్వీసులకు మరో 30 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.
ఆరోగ్యశ్రీ సేవలు బంద్! - రూ.1000 కోట్ల బకాయిలు, చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం
బిల్లుల చెల్లింపుల్లో జాప్యాన్ని ఆసరా చేసుకుంటున్న కొన్ని ఆసుపత్రులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద డబ్బులు ఇవ్వడం లేదంటూ రోగుల నుంచే అక్రమంగా వసూలు చేస్తున్నాయి. అవసరమైన వ్యాధి నిర్ధారణ పరీక్షలకు కూడా రోగుల నుంచే డబ్బులు దండుకుంటున్నాయి. ఇలా కొందరు రోగులు 10 వేల నుంచి 20 వేల వరకు సమర్పించుకుంటున్నారు. తర్వాత రోగులకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించినట్లు యాజమాన్యాలు ప్రభుత్వానికి క్లెయిమ్ చేసుకుంటున్నాయి. ఆరోగ్యశ్రీ చికిత్స పొందిన కేసులపై మెడికల్ ఆడిట్ జరగాలని కాగ్ సూచించినా నేటికీ అతీగతి లేకుండా పోయింది.
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని హెచ్చరిక- ఇకపై ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు ఉండవా?