YSRCP Government Neglect Nalli Creek in West Godavari : ఆక్వా , ఉప్పు రైతులు, మత్స్యకారులకు ఉపయోగపడే ఆ కాలువను గత వైఎస్సార్సీపీ సర్కారు నిర్లక్ష్యం చేసింది. తెలుగుదేశం హయాంలో చేపట్టిన కాలువ ఆధునికీకరణ పనులను నిలిపేసి తీర ప్రాంత గ్రామాల అభివృద్ధికి అడ్డుగా నిలిచింది. ఫలితంగా సముద్రపు ఆటుపోట్లు పాటు వర్షాలు వచ్చిన ప్రతి సారి ఆక్వా చెరువులతో పాటు ఉప్పు మడులు నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కూటమి సర్కారైనా కాలువ పనులు తిరిగి ప్రారంభించి తీర ప్రాంతవాసుల కల సాకారం చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.
కాలువ ఆధునికీకరణ నిలిపివేత : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని చినమైనవానిలంక వద్ద ఉన్న నల్లి క్రీక్‌ను గత టీటీడీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బియ్యపుతిప్పలో గోదావరి ముఖద్వారం నుంచి పడమర మోళ్లపర్రు, ఉప్పుటేరు వరకు విస్తరించి ఉంది. కాలగమనంలో మోళ్లపర్రు నుంచి కేపీపాలెం వరకు ఆక్రమణకు గురై మెరక భూములుగా రూపాంతరం చెందింది. బియ్యపుతిప్ప నుంచి కేపీపాలెం వరకు మిగిలి ఉన్న ప్రాంతంలో మత్స్యకారులకు చేపల వేటే ఆధారం. ఇది పూడిపోవడంతో కొంతకాలంగా గోదావరి ఆటుపోట్లు సక్రమంగా లేక మత్స్యసంపద అభివృద్ధి చెందడం లేదు. తీరంలోని పలు గ్రామాల్లో వర్షాలు కురిసినప్పుడు నీటిని మళ్లించడంలోనూ నల్లి క్రీక్ కీలకంగా ఉండేది. ప్రస్తుతం తీరంలో ఆక్వా చెరువులు విస్తరించడం, నల్లి క్రీక్ పూడిపోవడంతో మురుగు ప్రవాహానికి ఆటంకంతో పాటు మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటోంది.
కృష్ణమ్మ వరద జోరు - ఆక్వా రైతు బేజారు - Aqua Farmers Problems
వర్షాలు వచ్చిన ప్రతి సారి రైతులకు నష్టం : నల్లిక్రీక్ పూడిక పనులు చేపట్టకపోవడంతో నీటి ప్రవాహానికి దారంటూ లేకుండా పోయింది. తుపానులు, భారీ వర్షాల సమయంలో సమీపంలోని ఉప్పు మడులతో పాటు భూములు ముంపునకు గురవుతున్నాయి. నల్లిక్రీక్ పూడిక తీయాలని ఎన్నో ఏళ్లుగా మత్స్యకారులు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకున్న పాపానపోలేదు. చివరికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ సమస్యకు మోక్షం కలిగింది. బియ్యపుతిప్ప నుంచి కేపీపాలెం బీచ్ రహదారి వరకు పదకొండున్నర కిలోమీటర్ల మేర నల్లిక్రీక్ పూడిక తీసేందుకు రూ. 18 కోట్ల నిధులు కేటాయించి పనులు ప్రారంభించింది. బియ్యపుతిప్ప నుంచి ప్రారంభమై చినమైనవానిలంక వచ్చే సరికి ప్రభుత్వం మారడంతో ఆ పనులకు గ్రహణం పట్టింది.
వైఎస్సార్సీపీ పాలనలో కుదేలైన ఆక్వా రైతు- ఆస్తులు అమ్ముకుని వలస బాట - Aqua Farmers Problems
నిర్మాణానికి నోచుకోని దుస్థితి : 25% పూర్తికాని పనులను వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపివేయడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. నల్లిక్రీక్ పూడికతీతలో భాగంగా ప్రతిపాదించిన చినమైనవానిలంక వంతెన కూడా నిర్మాణానికి నోచుకోలేదు. ఎన్నో ఏళ్ల క్రితం శిథిలావస్థకు చేరుకున్న ఈ వంతెన మట్టి జారిపోయి కింద ఉన్న తూములు కొట్టుకుపోయి ప్రమాదకరంగా మారింది. దీనిపైనే స్థానికులు ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వమైనా నల్లిక్రీక్ ను ప్రాధాన్యత కింద పరిగణించి త్వరితగతిన పనులు పూర్తి చేయాలని మత్స్యకారులతో పాటు ఆక్వా, ఉప్పు రైతులు కోరుతున్నారు.
నాసిరకంగా టైగర్ రొయ్య సీడ్- నిండా మునుగుతున్న ఆక్వా రైతులు - Aqua Farmers Facing Problems