YSRCP Government Betrayed Dwakra Women Groups: ఎన్నికల ముందు సీఎం జగన్ అన్న మాట ఒక్క ఛాన్స్. ఈ అవకాశమే డ్వాక్రా సంఘాల ప్రగతిని పాతాళానికి నెట్టింది. పొదుపు, స్వయం ఉపాధిలో కోటి మంది సభ్యులతో ఆదర్శంగా నిలిచిన మహిళా సంఘాలకు తీరని ద్రోహం చేసింది. ఒక్కసారి అధికారమిస్తేనే జగన్ ఐదు సంవత్సరాలలో వారి అవకాశాలను నిర్వీర్యం చేసి వెన్ను విరిచారు. అక్క, చెల్లెమ్మ అంటూనే గత ప్రభుత్వం అమలు చేసిన అనేక పథకాలకు పాతరేశారు. డ్వాక్రా సంఘాల మహిళలు ఐదు సంవత్సరాల క్రితం దేశానికే దిక్సూచిగా నిలిచారు. ఇప్పుడు జగన్ సర్కార్ అసమర్థ విధానాలతో ప్రోత్సాహం కరవై దిక్కులు చూస్తున్నారు.
జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఏకంగా 7500 మంది డ్వాక్రా మహిళలను రోడ్డున పడేశారు. పెళ్లి కానుక పథకాన్ని అమలు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం 2500 మంది కల్యాణ మిత్రలను, చంద్రన్న బీమా పథకం అమలుకు 2వేల మంది బీమా మిత్రలను, పశువుల పెంపకంలో రైతులకు చేయూతగా నిలిచేందుకు 3వేల మంది పశు మిత్రలను డ్వాక్రా మహిళల నుంచే నియమించింది. వీరంతా నెలకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదించేవారు. అప్పట్లో వీరు ప్రతి పథకాన్నిలబ్ధిదారులకు చేరువ చేశారు. ఇలాంటి వారిని మరింత ప్రోత్సహించాల్సింది పోయి విధుల్లో నుంచే తీసేశారు.
ఉన్నతి పథకం కింద టీడీపీ ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకు చక్కటి ఆదరవు దక్కేది. మహిళల స్వయం ఉపాధికి చేయూత నివ్వడానికి 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం వీరికి రూ.800 కోట్లను వడ్డీ లేకుండా రుణాలుగా ఇచ్చింది. అప్పును నెలవారీ వాయిదాల్లో తిరిగి కట్టించుకునేది. మహిళా సాధికారతకు పెద్ద పీట వేయడంలో తనను మించిన వారే లేరన్నట్లు గొప్పలు చెప్పుకొనే సీఎం జగన్ ఈ ఐదు సంవత్సరాలలో ఉన్నతికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. గత ప్రభుత్వాలు ఇచ్చిన మొత్తాన్నే రొటేషన్ చేసుకుంటూ కాలాన్ని నెట్టుకొచ్చారు. డ్వాక్రా సంఘాల్లోని 18 నుంచి 59 ఏళ్లు నిండిన మహిళలకు 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛన్లు ఇచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో 2009లో అభయ హస్తం పథకాన్ని తీసుకొచ్చారు. దీనికి అర్హతలున్న మహిళలు ఏటా ప్రీమియం చెల్లిస్తూ వస్తున్నారు. పింఛను చెల్లించేందుకు ప్రభుత్వం ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుంది. దరఖాస్తుదారుల వాటా, ప్రభుత్వ వాటా కలిపి 2 వేల కోట్ల వరకు చేరింది. ఈ నిధిపై కన్నేసిన అభినవ అప్పుల అప్పారావు జగన్ ఎల్‌ఐసీని పథకం నుంచి తప్పించి ఆ మొత్తాన్ని తీసేసుకున్నారు. రెండు వేల కోట్లను ఏం చేశారో ఎటు మళ్లించారో కూడా తెలియడం లేదు.
ఎలా మాట్లాడాలో ముందే శిక్షణ - భజనలా ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి - CM Jagan sabha in erraguntla
టీడీపీ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా సంఘాలకు బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితి 10 లక్షల వరకు ఉండేది. ఆ లోపు రుణం ఎంత తీసుకున్నా 5 లక్షల వరకు సున్నా వడ్డీ రాయితీ వర్తించేది. జగన్ అధికారంలో రాగానే 3 లక్షలకే వడ్డీ రాయితీ వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. దాంతో డ్వాక్రా మహిళలపై వడ్డీ భారం పెరిగింది. వడ్డీ ఎందుకు పెరుగుతోందో అర్థంకాక డ్వాక్రా మహిళలు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై ఏమీ మాట్లాడకుండా ఠంచనుగా సున్నా వడ్డీ రాయితీకి బటన్ నొక్కుతున్నట్లు జగన్ బాకాలు ఊదుతున్నారు.
రాష్ట్రంలో ఎక్కడైనా సీఎం జగన్ బహిరంగ సభ ఉందన్నా మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనే సమావేశాలు ఏర్పాటు చేస్తారన్నా డ్వాక్రా మహిళలు బెంబేలెత్తే పరిస్థితిని తీసుకొచ్చారు. అనారోగ్యం, అత్యవసర పనులున్నా సమావేశం ఉందంటే చాలు కిమ్మనకుండా వెళ్లాల్సి వచ్చింది. లేకపోతే సంక్షేమ పథకాలు నిలిపేస్తామని అధికారులతో హుకుం జారీ చేయించారు. ఇది కేవలం ప్రభుత్వ కార్యక్రమాలకే పరిమితం కాలేదు. వైసీపీ నిర్వహించిన ర్యాలీలు, మూడు రాజధానుల పేరుతో చేపట్టిన గర్జనలు, సామాజిక సాధికారత సభలు, ప్లీనరీ వంటి పార్టీ సమావేశాలకూ వర్తింప చేశారు. గతంలోనూ ప్రభుత్వ కార్యక్రమాలకు డ్వాక్రా మహిళల్ని తరలించడం ఉన్నా ఇంత స్థాయిలో బెదిరింపులు ఎప్పుడూ లేవు.
జగన్ పర్యటనలో ఉద్రిక్తత - భూమా అఖిలప్రియను అడ్డుకున్న వైసీపీ శ్రేణులు
టీడీపీ ప్రభుత్వంలో లబ్ధి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్నింటా డ్వాక్రా మహిళలకు అగ్రతాంబూలం దక్కింది. అవకాశమున్న ప్రతి చోటా అప్పటి ప్రభుత్వం వారి సేవల్ని వినియోగించుకుంది. ఇందుకు ప్రతిఫలంగా ఆర్థిక ప్రోత్సాహకాలను అందించి వారి కుటుంబాలు నిలదొక్కుకునేలా చేసింది. ఈ సంఘాల సభ్యుల్లోని వేల మంది బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఏజెంట్లుగా సేవలందించారు. ఉపకార వేతనాలు, ఉపాధి వేతనాలు, పింఛన్లు పంపిణీ చేశారు. బీమా, కల్యాణ మిత్రలుగా పనిచేశారు. ఏకంగా మూడు లక్షల మంది సేంద్రీయ వ్యవసాయంలో ప్రవేశించారు. అన్న సంజీవని పేరుతో జనరిక్ మెడికల్ దుకాణాలు నిర్వహించారు. ఉపాధి హామీ రహదారుల వెంట మొక్కలు పెంచారు. టీడీపీ హయాంలో అమలైన ఉచిత ఇసుక విధానాన్ని కూడా తొలుత డ్వాక్రా సంఘాల ద్వారానే చేయించారు. జగన్ ప్రభుత్వంలో ఇంత కంటే ఎక్కువ చేయూత లభిస్తుందని ఆశించిన డ్వాక్రా మహిళలకు భంగపాటే ఎదురైంది. సీఎం పీఠం ఎక్కగానే ఈ విధానాలన్నింటికీ ఆయన చరమగీతం పాడారు.
వైఎస్సార్సీపీ పాలనలో భావితరాల భవిష్యత్తు అంధకారమైంది: కామినేని శ్రీనివాసరావు