YSR Architecture and Fine Arts University: వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ నిర్మించి తీరుతామని సీఎం జగన్ ప్రగల్భాలు పలికారు. ఇందుకోసం కడప శివారులోని చలమారెడ్డి పల్లె సమీపంలో అప్పటి కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది భూములను పరిశీలించారు. 134 ఎకరాల విస్తీర్ణంలో 452 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం 400 కోట్లు విడుదల చేయాలని మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు. భవన నిర్మాణాలకు సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారని హడావుడి చేసినా అది సాగలేదు.
దాంతో మాట మార్చి కడప యోగి వేమన విశ్వవిద్యాలయం పక్కనే ఆర్కిటెక్చర్ వర్సిటీ భవనాల నిర్మాణం చేపడతామని రెండేళ్ల కిందట ప్రకటించారు. యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) పక్కనే గంగనపల్లె పరిధిలో 110 ఎకరాల భూమిని వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (ఏఎఫ్‌యూ) భవనాల నిర్మాణానికి కేటాయించారు. 345 కోట్లతో వర్శిటీ నిర్మిస్తామని మరోమారు మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారే తప్ప పనులు ప్రారంభం కాలేదు. ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చిన ప్రతిసారి ఏఎఫ్‌యూ నిర్మాణానికి భూమి పూజ చేస్తారని హడావుడి చేసినా కార్యరూపం దాల్చలేదు.
ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడం కాదు..! రాజకీయాలకు కేంద్రాలుగా.. యూనివర్సిటీలు..!
విద్యార్థుల బోధన కోసం కడప శివారులోని గ్లోబల్ ఇంజినీరింగ్ కళాశాలలోని భవనాలను తాత్కాలికంగా అద్దెకు తీసుకుని నడిపిస్తున్నారు. అరకొర వసతులతోనే ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. కళాశాల యాజమాన్యానికి నెలకు 20 లక్షల చొప్పున చెల్లించారు. ఒప్పందం ప్రకారం గడువు ముగిసినా 6 నెలల నుంచి అద్దె చెల్లించలేదు. భవనాలను ఖాళీ చేయాలని ప్రైవేటు కళాశాల యాజమాన్యం చెప్పడంతో ఏఎఫ్‌యూ పరిస్థితి తలకిందులైంది. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన ముగిసి ఎన్నికలు రావడంతో ఈ 6 నెలలకు చెల్లించాల్సిన కోటి 20 లక్షల రూపాయలు ఎవరు చెల్లించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది.
సొంత భవనాలు లేక, అద్దె భవనాల్లో నడిపించలేక ఆర్కిటెక్చర్ యూనివర్శిటీ యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ఆర్కిటెక్చర్ వర్సిటీలో ప్రస్తుతం 400 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కావస్తుండటంతో తరగతులు ఎక్కడ నిర్వహించాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. యోగి వేమన వర్సిటీలోని కొన్ని నూతన భవనాలను వాడుకోవాలని ఆర్కిటెక్చర్ వర్సిటీ యాజమాన్యం ప్లాన్ వేసింది.
రిజిస్ట్రార్ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి సీఎం బంధువు కావడంతో వైవీయూపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. యోగి వేమన వర్సిటీలోని పరిపాలన భవనం ఇచ్చేందుకు వీసీ నిర్ణయించినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. నెలాఖరులోగా భవనాలు అప్పగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారంటూ అధ్యాపకులు వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై వైవీయూ, ఏఎఫ్‌యూ మధ్య అనిశ్చితి నెలకొంది.
ఒకే క్యాంపస్‌లో రెండు విశ్వవిద్యాలయాలు నిర్వహించడం సాధ్యం కాదని వైవీయూ పూర్వ విద్యార్థులు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని చెబుతున్నా అధికారులు పెడచెవిన పెడుతున్నారని మండిపడుతున్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రాధాన్యత దెబ్బతిని న్యాక్ గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు.
అటకెక్కిన తిరుపతి, విశాఖ నైపుణ్య విశ్వవిద్యాలయాల ఏర్పాటు - యువతకు నైపుణ్య లేమి?