Sharmila Visit To Vijayawada Singh Nagar : విజయవాడ ముంపు ప్రాంతాల్లో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల పర్యటించారు. సింగ్‌నగర్ ప్రాంతంలో పర్యటించిన షర్మిల వరద బాధితులతో మాట్లాడారు. పలువురికి ఆహారం, తాగునీటి ప్యాకెట్లను షర్మిల అందజేశారు. గతంలో బుడమేరు నీటిని కొల్లేరులో కలిపేందుకు వైఎస్.రాజశేఖర్ రెడ్డి చర్యలు తీసుకున్నారని తెలిపారు. విజయవాడలో ముంపును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తేవాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధితులను పూర్తి స్థాయిలో ఆదుకోవాలని కోరారు. చాలా మందికి మంచి నీరూ అందలేదని ధ్వజమెత్తారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పడం మంచి విషయమని పేర్కొన్నారు. ఇదే విధంగా పూర్తి స్థాయిలో వరద బాధితులను ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. బుడమేరు రక్షణకు వెంటనే చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు.
కదిలిస్తే కన్నీరే - సర్వం కోల్పోయామని సింగ్‌నగర్ వాసుల ఆవేదన - Vijayawada flood
'రాష్ట్రంలో ఇంత నష్టం జరిగినా, ఇంత ఘోర విపత్తు వచ్చినా ప్రధానికి ఇది కనిపించడంలేదా? గత పది సంవత్సరాలుగా ఏపీలో ఎంత మంది ఎంపీలు ఉంటే అందరూ మోదీకే బానిలయ్యారు. అయినా అన్ని విషయాల్లో ఏపీకి ఒరిగిందేమీ లేదు. ఇప్పటికైనా ప్రధాని స్పందించి దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించి బాధితులకు సహాయం చేయాలి. ఇలాంటి విపత్తులు మళ్లీ రాకుండా రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత చంద్రబాబు పై ఉంది. ముఖ్యమంత్రి తగిన చర్యలు తీసుకోవాలి. బుడమేరు కబ్జాలపై తీవ్ర చర్యలు చేపట్టాలి.' - వైఎస్. షర్మిల
విజయవాడ నగరం మూడో రోజూ ముంపులోనే ఉన్న సంగతి తెలిసిందే. వరద తీవ్రత తగ్గినా, కాలనీల్లో చేరిన నీరు అలాగే ఉంది. నిర్వాసితులు విద్యుత్తు, మంచినీరు లేక ఇబ్బంది పడుతున్నారు. వారికి సహాయ, పునరావాస కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం, ఎన్జీవోలు, దాతలు ఉదారత చాటుకుంటున్నా, బాధితుల్లో చివరి వారికి సహాయం అందించడం కష్టతరమవుతుంది. మంత్రులు నేతలు ప్రజా క్షేత్రంలో పర్యటిస్తూ ప్రజలకు సాయం అందిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నప్పటికీ మళ్లీ వస్తున్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు వణికిపోతున్నారు.