YS SHARMILA ELECTION CAMPAIGN: దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఎక్కడైనా ఉందా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ కృష్ణలంక రాణిగారితోటలో బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా జగన్ తయారు చేశారని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ఎక్కడో చెప్పలేని పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు.
ఒక్క ఛాన్స్ అంటూ జగన్ సీఎం అయ్యారని, వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని అన్నారని, మూడు రాజధానుల్లో కనీసం ఒక్క రాజధాని కూడా లేదని ఎద్దేవా చేశారు. ఒక్క పరిశ్రమ లేదని, రాష్ట్రంలో అభివృద్ధి లేదని విమర్శించారు. పరిశ్రమలు లేకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడొస్తాయని నిలదీశారు. ఓటు అనే ఆయుధాన్ని జాగ్రత్తగా ఆలోచించి వేయండని షర్మిల పిలుపునిచ్చారు.
నాడు ఉరి తీయాలన్నవాడే - నేడు తండ్రి అయ్యాడా?: వైఎస్ షర్మిల - YS Sharmila criticized CM Jagan
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా వస్తుందని షర్మిలా హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వస్తేనే పోలవరం, ప్రత్యేక హోదా, రాజధాని సహా అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని భరోసా ఇచ్చారు. కుల, మతాలకు అతీతంగా అందరినీ అక్కున చేర్చుకునే పార్టీ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు.
రాజధానికి సహాయం చేస్తామని బీజేపీ మోసం చేస్తే, మళ్లీ వాళ్ల కొంగు పట్టుకొనే వైసీపీ, టీడీపీ నాయకులు తిరుగుతున్నారని ఆరోపించారు. దేశంలో ఒక్క ఏపీ తప్ప రాజధాని లేని రాష్ట్రం ఉందా అంటూ షర్మిలా ప్రశ్నించారు. 10 ఏళ్ల క్రితం రాష్ట్రం ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని, అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే మాదిరిగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మాయమాటలు కాకుండా మంచి చేసేవాళ్లకు ప్రజలు ఓట్లు వేయాలని, ఇండియా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని షర్మిల అభ్యర్థించారు.
ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో అభివృద్ధి శూన్యం: వైఎస్ షర్మిల - YS Sharmila Election Campaign