YS Jagan Cheated Farmers: రైతు భరోసా కింద ఇచ్చే సాయం దేశంలో మరెక్కడా ఇవ్వడం లేదని జగన్ కొట్టే డబ్బు అంతాఇంతా కాదు. ఐదేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి 7 వేల 500 రూపాయలు మాత్రమే ఇచ్చారు. కానీ ఒక్కో రైతు కుటుంబానికి 13 వేల 500 రూపాయలు ఇస్తున్నామంటూ NDA ప్రభుత్వం ఇచ్చే పీఎం కిసాన్ సొమ్మునూ తన ఖాతాలో కలిపేసుకున్నారు.
అయిదేళ్లలో ఆయన ఇచ్చింది 19 వేల 170 కోట్ల రూపాయలు మాత్రమే. హామీకి అనుగుణంగా 29 వేలు కోట్లు ఇవ్వాల్సి ఉంటే అందులో 9 వేల 830 కోట్ల రూపాయలను ఎగ్గొట్టారు. అదే తెలంగాణలో ఏడాదికి 14 వేల 800 కోట్ల చొప్పున రైతు ఖాతాల్లో జమ చేశారు. జగన్ మాత్రం తానిచ్చేదే ఘనమైనదంటూ వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలను కుదించడం, రాయితీ ఎత్తేయడం ద్వారా అన్నదాతలకు రావాల్సిన మొత్తంలో 5 వేల కోట్ల రూపాయలకు పైగా కోత పెట్టారు.
భారంగా మారుతున్న రైతు భరోసా కేంద్రాలు
జగన్ చెప్పే మరో పచ్చి అబద్ధమేంటో తెలుసా? రైతు భరోసా రూపంలో వైఎస్సార్సీపీ సర్కారు ఇచ్చే 7వేల 500 రూపాయల మొత్తంతో అన్నదాతల ఖర్చులన్నీ తీరిపోతాయట. అందుకే పంటనష్టం పోయినా వారికి వచ్చే ఇబ్బంది ఏముంటుందని అన్నదాతలను చులకన చేసి మాట్లాడటమూ ఆయనకే చెల్లుతుందేమో? అది చాలదన్నట్లు రైతులకు అయ్యే మొత్తం పెట్టుబడి ఖర్చులో 80 శాతం తామే భరిస్తున్నామంటున్నారు. ముఖ్యమంత్రి స్థాయిలోని వ్యక్తి అధికారం కోసం ఇలా పచ్చి అబద్ధాలు చెప్పాలా? 7 వేల 500 పెట్టుబడితో ఎన్ని ఎకరాలు సాగవుతుంది?
గతంలో రాష్ట్రంలో వ్యవసాయమే లేదని, తానొచ్చాకే ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు వ్యవసాయ పాఠాలు మొదలు పెట్టినట్లు జగన్ ప్రభుత్వం చెబుతోంది. 10 వేల 778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నదాతల చేయిపట్టుకుని నడిపిస్తున్నామంటూ అదేపనిగా బాకాలూదుతోంది. ఆర్బీకేల్లో ఏడు వేల మందికి పైగా సిబ్బంది కొరత ఉంది. వాటికి భవనాల్లేవు, మౌలిక వసతుల్లేక సిబ్బంది అల్లాడుతున్నారు. అన్నదాతలకు చేదోడు వాదోడుగా ఉంటూ సలహాలు, సూచనలు అందించాల్సిన బాధ్యత వారిది. అయితే వ్యవసాయంలో కీలకమైన విస్తరణను గాలికొదిలేశారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అమ్మిస్తున్నారు.
జగన్ మాటలకు చేతలకు పొంతన కరవు-అటకెక్కిన డ్రోన్ పంపిణీ ప్రాజెక్టు
ప్రభుత్వమేదున్నా పంటల బీమా అయినా, సున్నా వడ్డీలైనా, వ్యవసాయ రాయితీలైనా పాలనలో భాగంగా ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంటారు. ఏ ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి విడుదల చేసిన సందర్భాలు లేవు. వైఎస్సార్సీపీ పాలనలో కొత్త ఎత్తుగడ మొదలైంది. పథకాలకు నిధుల విడుదల పేరిట ఏడాదికోసారి విడుదల చేస్తున్నారు. అన్నదాతలకు కలిగే మేలు పావలా అయితే ప్రచారం మాత్రం ముప్పావలా తీరున ఉంటోంది.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రుణమాఫీ హామీ అమలులో భాగంగా రైతులకు 15 వేల 148 కోట్ల రూపాయలు ఇచ్చారు. 50 వేల లోపు పంట రుణాలను ఒకేసారి మాఫీ చేశారు. దీంతో లక్షల మంది ప్రయోజనం పొందారు. 2.23 లక్షల మంది ఉద్యాన రైతులకు ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున ఒకేసారి 50 వేల రుణాల్ని రద్దు చేశారు. దీనికి 385 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అన్నదాత సుఖీభవ కింద 2018-19లో 2 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశారు.
కౌలు రైతులకు భరోసా హామీని విస్మరించిన జగన్ - హామీల్లో 99% అమలు చేయడమంటే ఇదేనా?
ఏడాదికి 80 కోట్ల రూపాయల విలువైన సూక్ష్మపోషకాలను అందించారు. దీనితో రైతులకు దిగుబడులు పెరిగాయని, అదనపు ఆదాయం లభించిందని అధ్యయనాల్లో వెల్లడైంది. జగన్ వచ్చాక ఈ పథకాన్ని పూర్తిగా ఏత్తేశారు. వ్యక్తిగత యాంత్రీకరణ కింద టార్పాలిన్లు, పిచికారీ యంత్రాలు, ఇతర వ్యవసాయ ఉపకరణాలను రాయితీపై ఇచ్చారు. వైఎస్సార్సీపీ సర్కారుకు అవి ఇవ్వడానికి మనసొప్పలేదు. వర్షాలు, వరదలకు పంటలు దెబ్బతింటున్నా టార్పాలిన్లు కూడా ఇవ్వకుండా కళ్లు మూసుకుంది. రైతుల్ని వానలు, వరదలకు వదిలేసింది. గతంలో సున్నా వడ్డీతో పాటు, పావలా వడ్డీ పథకాలను అమలు చేశారు.
రాష్ట్రంలో రైతులు ఏటా తీసుకునే పంట రుణాలపై ఏడాదికి 4 వేల కోట్ల రూపాయలకు పైగా సున్నా వడ్డీ ప్రయోజనాలు అందించాల్సి ఉంటుందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఆయన ఇచ్చింది ఏడాదికి 200 కోట్ల రూపాయలు కూడా లేవు. పంట రుణాలు తీసుకున్న మొత్తం రైతులకు వెయ్యూ 26 కోట్లు మాత్రమే దక్కాయి. పంట రుణాలు తీసుకున్న మొత్తం రైతుల్లో 12 శాతం మందికి మాత్రమే వడ్డీలేని రుణాలు అందించారు. వెయ్యీ 26 కోట్లు మాత్రమే సున్నా వడ్డీ రుణాలిచ్చారు.
గతంలో ఏడాదిలోగా చెల్లిస్తే వెంటనే సున్నా వడ్డీ అమలయ్యేది. వైఎస్సార్సీపీ వచ్చాక ముందు రైతుల నుంచి వడ్డీని ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. తర్వాత ఎప్పటికో బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. అదెప్పటికి వస్తుందో కూడా తెలియదు. సహకార బ్యాంకుల రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 3లక్షల రూపాయల వరకు తీసుకునే పంట రుణాలపై పావలా వడ్డీ పథకాన్ని గతంలో అమలు చేశారు. జగన్ పుణ్యమా అని అదీ ఎత్తిపోయింది.
Farmers problems: రైతుకి 'భరోసా' ఇవ్వని కేంద్రాలు.. దీంతో ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న రైతులు