Police Case Booked Against Youtuber Money Reels : డబ్బంటే ఎవరికి చేదు. అందులోనూ ఫ్రీగా వస్తోందంటే ఎవరు మాత్రం ఎగబడకుండా ఉంటారు. ఇదే అంశాన్ని క్యాష్ చేసుకోవాలనుకున్న ఓ యూట్యూబర్ తన రీల్ కోసం ఓ ప్లాన్ వేశాడు. అతడు అనుకున్నట్టుగానే జనాలు ఎగబడడంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా ఫేమ్ కోసం జనం మధ్యలో ఇలా డబ్బులు వెదజల్లుతూ, ఆ వీడియోలు ‘ఇన్‌స్టాగ్రాం’లో పోస్టు చేసినందుకుగానూ యువకుడిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు.
ఇంతకీ ఏమి జరిగిందంటే : మోతీనగర్ పరిధి పర్వత్‌నగర్‌కు చెందిన వంశీ పవర్(24) అలియాస్ హర్ష యూట్యూబర్. ఇన్‌స్టాగ్రాంలో అకౌంట్ తెరిచి తరచూ పలు అంశాలపై మాట్లాడుతూ వీడియోలు పోస్టు చేస్తుంటాడు. ఇటీవల పలుచోట్ల డబ్బులు దాచిపెడుతూ ముందుగా వచ్చి నగదు తీసుకుని లబ్ధి పొందాలని ఫాలోవర్స్‌కు సూచనలు చేస్తూ లైవ్ వీడియోలు చేశాడు. అంతటితో ఆగకుండా రద్దీగా ఉన్నా పలుచోట్లు జనంలోకి వెళ్లి ఒక్కసారిగా నోట్లను విసిరేయడం, ఆ వీడియోలను ఇన్‌స్టాలో పోస్టు చేయడం చేశాడు.
జూన్‌లో కూకట్‌పల్లి మెట్రో స్టేషన్ సమీపంలో డబ్బులను గాల్లోకి విసిరేశాడు. వాటిని ఏరుకోవడానికి జనం గుమిగూడటం వంటి దృశ్యాలను తీసి తన ఇన్‌స్టా ఖాతాలో అప్లోడ్ చేశాడు. నగదును ఏరుకోవడానికి జనాలు ప్రయత్నించడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. అసలే బిజీ రోడ్డు కావడం, రోడ్డుపై ఉన్న వారంతా కరెన్సీ నోట్ల కోసం అడ్డదిడ్డంగా పరుగెత్తడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సుమారు 50వేల రూపాయల విలువైన వంద నోట్లను వంశీ పవర్ గాల్లోకి విసిరాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో దీనికి వ్యూస్ వచ్చాయి.
Youtuber Harsha Arrest : మరోవైపు యూట్యూబర్ తీరుపై పలువురు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అతడు చేసిన పనికి రద్దీ రోడ్లపై గందరగోళ పరిస్థితులు తలెత్తాయని, అటువంటి అనాలోచిత పనులు మానుకోవాలని కామెంట్లు చేశారు. పోలీసులు పబ్లిక్ ప్రదేశాల్లో ఇలాంటి వీడియోలు తీయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తంగా ఆ వీడియోలు వైరల్‌గా మారడంతో నిందితుడిపై కూకట్‌పల్లి పోలీసులు ‘న్యూసెన్స్’ కేసు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే శుక్రవారం నిందితుడిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. సోషల్ మీడియా వీడియోలు, రీల్స్ కోసం ప్రజలకు ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే కఠినమైన కేసులతో చట్టాలు స్వాగతం పలుకుతాయని, తస్మాత్ జాగ్రత్త అని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. వంశీ ఇదే విధంగా కేపీహెచ్‌బీ, సనత్ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సైతం డబ్బులు గాల్లోకి ఎగురవేయటంతో ఆయా పోలీస్ స్టేషన్లలోనూ కేసులు నమోదు చేశారు.