Youth Voting in Andhra Pradesh Elections: మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న దృఢ సంకల్పంతో ఐటీ ఉద్యోగులు, ఇతర రాష్ట్రాలకు ఉపాధి పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన యువత పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌లో ఉద్యోగాల నిమిత్తం ఉంటోంది. వీరంతా సోమవారం సొంత ఖర్చులతో 42 బస్సులు ఏర్పాటు చేసుకుని మరీ వచ్చారు. మలికిపురంలో బస్సులు ఆపి అక్కడి నుంచి వ్యక్తిగత వాహనాల్లో సొంత గ్రామాలకు వెళ్లి ఓటేశారు. ఇందులో ఎక్కువ మంది కొత్తగా ఓటు హక్కు వచ్చిన యువతే ఉండటం గమనార్హం.
కేవలం ఒక ప్రాంతంలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీగా పోలింగ్ శాతం నమోదైంది. వివిధ ప్రాంతాలలో ఉన్న ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో ఎన్నికల సమరంలో కీలకమైన పోలింగ్ ఘట్టంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. రాష్ట్ర భవితను నిర్ణయించేందుకు జనం పోటెత్తారు. సోమవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు.
యువత, మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. పలుచోట్ల ఈవీఎంల మొరాయింపుతో తొలుత మందకొడిగా సాగిన ప్రక్రియ క్రమంగా ఊపందుకుంది. మధ్యాహ్నం ఎండను సైతం లెక్కచేయకుండా ఓటరు మహాశయులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు సైతం కుటుంబసభ్యుల సాయంతో ఓటేసేందుకు తరలివచ్చారు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసిన తరువాత కూడా అనేక చోట్ల కేంద్రాలు కిటకిటలాడాయి. రాత్రి 12 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.
భారీగా నమోదైన ఓటింగ్ శాతం - అర్ధరాత్రి వరకూ క్యూలైన్లలో జనం - andhra pradesh elections 2024
పోటెత్తిన యువశక్తి: రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంటు, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా ప్రతి చోట యువ ఓటర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఎక్కువ మంది యువత ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, మహారాష్ట్ర, గుజరాత్ వంటి సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన వారిలో చాలా మంది ఓటేసేందుకు తరలివచ్చారు.
సాయంత్రానికి తిరుగు ప్రయాణం: సొంత ఊరిలో ఓట్లేసిన ప్రజలు సాయంత్రానికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు. బస్సులు, కార్లు ఏ వాహనం దొరికితే అది పట్టుకొని బయల్దేరారు. దీంతో హైదరాబాద్ వైపు వచ్చే రహదారుల్లో సోమవారం సాయంత్రం 5 గంటల దాటాక ఒక్కసారిగా రద్దీ పెరిగింది. రద్దీ అంతకంతకు పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సుమారు 6 లక్షల మంది తెలంగాణ నుంచే వచ్చినట్లు అంచనా.
వివిధ దేశాల నుంచి ప్రవాసాంధ్రులు: సార్వత్రిక ఎన్నికల్లో హక్కు వినియోగించుకునేందుకు వివిధ దేశాల నుంచి ప్రవాసాంధ్రులు సైతం పెద్దఎత్తున తరలివచ్చారు. అంతే కాకుండా కొంతమంది 3, 4 నెలలుగా ప్రచారంలో కూడా పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులుతీరి ఓటేశారు. ఎక్కువ శాతం ప్రవాసాంధ్రులు సాయంత్రానికే తిరుగు ప్రయాణమయ్యారు. ‘మేము ఓటు వేశాం, మరి మీరు’ అంటూ సోషల్ మీడియాలలో ఫొటోలు పంచుకున్నారు.