Youth Fire on YSRCP Govt : ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అంటూ ఊరించి గద్దెనెక్కిన జగన్ నిరుద్యోగులను నిండా ముంచారు. ఎన్నికల వేళ DSC, గ్రూప్ 1, 2 నోటిఫికేషన్లు అంటూ హడావుడి చేశారే కానీ నిరుద్యోగుల సంఖ్యకు తగ్గ పోస్టులు విడుదల చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోయినా ప్రైవేటు ఉద్యోగాల్లోనైనా స్థిరపడదామనుకున్న యువత ఆశలపైనా పాలకులు నీళ్లు చల్లారు. ఏపీకి పెట్టుబడులు రాక పక్క రాష్ట్రాలకు యువత వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.
ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ విధానాలపై యువత ఆగ్రహం
'వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తానని పాదయాత్రలో హామీలు కురిపించిన జగన్ నిరుద్యోగ సమస్యలను గాలికొదిలేశారు. నాలుగేళ్లు కాలయాపన చేసి ఎన్నికలు దగ్గర పడటంతో నామ మాత్రపు పోస్టులతో గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు కానిచ్చేశారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రకటించి అటు పాఠశాల విద్యను ఇటు ఉపాధ్యాయ అభ్యర్థుల జీవితాలను ఉద్ధరిస్తామని జగన్ హామీలు గుప్పించారు. కానీ సీఎం పీఠం ఎక్కాక ఆ విషయాన్నే మర్చిపోయారు. రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది నిరుద్యోగులు DSC కోసం వేచిచూస్తుంటే కేవలం 6వేల 100 పోస్టులు ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఇంత తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడంపై నిరుద్యోగుల నుంచి ఆగ్రహ జ్వాలలు ఎగసిపడినా ప్రభుత్వం పట్టించుకోలేదు.' -నిరుద్యోగులు
'150 కోట్లకు గ్రూప్-1 పోస్టులు అమ్మేశారు' - వైసీపీ సర్కారుపై నిరుద్యోగుల ఆగ్రహం
Unemployed Problems in Andhra Pradesh : ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇలా ఉంటే ప్రైవేటు రంగంలోనూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్దగా ఉద్యోగాలు కల్పించలేదు. గతేడాది జరిగిన విశాఖ సదస్సులో 13 లక్షల కోట్ల పెట్టుబడులతో, 6 లక్షల ఉద్యోగాలు కల్పించే 340 ఒప్పందాలు జరిగాయని సాక్షాత్తూ ముఖ్యమంత్రే అప్పట్లో గొప్పగా చెప్పారు. ఏడాది దాటినా ఇప్పటి వరకు ఎన్ని కంపెనీలు పెట్టారు. ఎంత మందికి ఉపాధి కల్పించారనేది ప్రశ్నార్థకమే. డిగ్రీలు, పీజీలు చేసిన వాళ్లు ఉద్యోగాల కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుందన్న ఆశలు సన్నగిల్లడంతో నిరుద్యోగులు చిన్నాచితకా ఉద్యోగాలు, కూలీ పనులు చేసుకుంటూ బతుకీడుస్తున్నారు. హామీలు నెరవేర్చని పాలకులకు వచ్చే ఎన్నికల్లో ఓటుతో తగిన గుణపాఠం చెబుతామని నిరుద్యోగులు హెచ్చరిస్తున్నారు.
గ్రూప్-1 పరీక్ష రద్దుపై విచారణ వాయిదా- మధ్యంతర ఉత్తర్వులు కొనసాగింపు - appsc Group1 Exam