Telugu Women In BRICS Summit Russia : ఆర్థిక ఇబ్బందులు చదువుకు అడ్డుకావని నిరూపిస్తోంది ఈ యువతి. చదువుకోవాలనే ఆశతో ప్రభుత్వ విద్యాసంస్థలో చేరి ప్రతిభ కనబరిచింది. ప్రపంచాన్ని బయపెడుతోన్న క్యాన్సర్‌పై పరిశోధన చేయాలని పీహెచ్‌డీ కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతోంది. ఆమె సమాజ సేవ కార్యక్రమాలు చేస్తూ నాయకత్వ లక్షణాలు నేర్చుకుంది. ప్రతిభ, సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం బ్రిక్స్ యూత్ సదస్సుకు పాల్గొనే అవకాశాన్ని కల్పించింది.
ఆ యువతి పేరు అయేషా. విశాఖపట్నం స్వస్థలం. తండ్రి రెహమాన్ లారీ డ్రైవర్, అమ్మ మదీనాబీబీ చికెన్ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తోన్నారు. పేద కుటుంబం, నిరక్ష్యరాస్యులు అయినా ఈ తల్లిదండ్రులు ఎక్కడా వెనకడుగు వేయలేదు. పిల్లలను బాగా చదువుకోవాలని ప్రోత్సహించారు. వీరి కృషి ఊరికే పోలేదు. కుమార్తెల్లో ఒకరైన ఆయేషా కుటుంబ ప్రతిష్ఠను మరో స్థాయికి తీసుకెళ్లేంది.
ఆర్థిక పరిస్థితుల్లో తన అక్కలు ఇద్దరు చదువుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే చూసి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుంది అయేషా. చదువుల్లో రాణించి విజయనగరం కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో పీజీ చదివింది. పీహెచ్‌డీ కోసం రెండో ప్రయత్నంలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సీటు సాధించింది. ఫెలోషిప్‌తో చదువుకుంటానని కుటుంబాన్ని ఒప్పించి హైదరాబాద్‌కు వెళ్లింది అయేషా.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగంలో చేరింది అయేషా. పీహెచ్‌డీ చేస్తున్నప్పుడే విద్యార్థి రాజకీయాల్లో ప్రవేశించింది. ఫీజు రీయంబర్స్‌మెంట్ నిలిచిపోతే పోరాటాలు చేసింది. క్రమంగా విద్యార్థి నాయకురాలిగా ఎదిగింది. సామాజిక సేవా కార్యకలాపాల్లో పాల్గొని మానవ హక్కులు, రుతుక్రమం సమయంలో పాటించాల్సిన శుభ్రత గురించి మురికి వాడల్లో ప్రచారం చేసింది. మహిళా సాధికారత కోసం మిషన్ సహస్రి కింద పలు కార్యక్రమాల్లో పాల్గొంది
విజయవాడ విలుకాడు- శిక్షణ ప్రారంభించిన అనతి కాలంలోనే పతకాల పంట - Archery champion Trinath
చదువును ఎక్కడా నిర్లక్ష్యం చేయకుండా సేవ కార్యక్రమాల్లో చురుకుగా ముందుకు సాగింది అయేషా. ఈ సమయంలోనే బ్రిక్స్ సదస్సు కోసం కేంద్ర యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ల్లో దరఖాస్తు చేసింది. ఈ యువతి ప్రతిభ, సేవ కార్యక్రమాలను గుర్తించి బ్రిక్స్ సదుస్సుకు కేంద్రం ఆహ్వానించింది. ఇటీవల రష్యాలో జరిగిన ఆ సదస్సులో పాల్గొని యూత్ కమ్యూనిటీ సర్వీసెస్, వాలంటరీ వర్క్‌లపై తన ప్రతిపాదనలు తెలిపింది.
'బ్రిక్స్ సదస్సులో నా ప్రతిపాదనలకు ప్రశంసలు అందాయి. బ్రిక్స్ దేశాల్లోని యువ వాలంటీర్లు పొరుగు దేశాల సంస్కృతులు తెలుసుకోవడానికి స్వచ్ఛంద సేవ, నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి ఒక కార్యక్రమం ప్రారంభించాలని సిఫార్సు చేశాను. ఇలా వివిధ అంశాల పై చేసిన ప్రతిపాదనలను కేంద్ర మంత్రి రక్షాఖాడ్సే, రష్యా మంత్రులు గుర్తించి ప్రశంసించారు.' -అయేషా, పీహెచ్‌డీ విద్యార్థిని
'జీవితంలో సొంత ఎదగడానికి అయేషా ఇష్టపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు అడ్డువచ్చినా, ప్రతిభతో ముందుకు సాగింది. అంతర్జాతీయ సదస్సులో పాల్గొని మా కుటుంబానికి పేరు తీసుకొచ్చింది.' -మదీనాబీబీ, రెహమాన్, అయేషా తల్లితండ్రులు
ఆడపిల్ల బయటికొస్తే ఎదురయ్యే సమస్యలు, సవాళ్లు అన్నింటిని అధిగమిస్తూ ముందుకు వెళ్తోంది అయేషా. సమాజహిత ప్రతిపాదనలు చేసి బ్రిక్స్ దేశాల యూత్ సమ్మిట్లో అందరి ప్రశంసలందుకుంది. ఈ సదస్సులో పాల్గొన్న ఏకైక తెలుగమ్మాయిగానూ రికార్డు సాధించింది. భవిష్యత్తులో అధ్యాపకురాలిగా స్థిరపడి సొంతంగా ఎన్జీవో ఏర్పాటు చేసి సేవ కార్యక్రమాలు చేస్తానని చెబుతోంది ఈ యువతి.