Young Woman Wrote a Book on Social Injustice to Widowed Women: అత్యున్నత విద్యావంతులు సైతం సంప్రదాయాల పేరిట వితంతువులను బాధపెట్టడం చూసి చలించిపోయింది ఈ యువతి. టెక్ యుగంలోనూ ఇలాంటి అనాచారాలు కొనసాగటం తనను బాధకు గురి చేసింది. భర్తను కోల్పోయిన స్త్రీలను శుభకార్యాల్లో ఇతరులు వెలివేసినట్లుగా చూడటం సరికాదని చాటాలనుకుంది. ఎంతో అధ్యయనం చేసి "ది పాలిష్డ్ ఇన్ హ్యూమన్ ట్రీట్‌మెంట్" పేరిట ఒక పుస్తకాన్ని తీసుకొచ్చింది. ఆమె విజయవాడకు చెందిన సౌమ్య.
విజయవాడకు చెందిన సౌమ్య తూములూరి సీఏ(CA) చదువుతోంది. యోగా శిక్షకురాలిగానూ పనిచేస్తోంది. చిన్నప్పటి నుంచే వితంతువులను కట్టుబాట్ల పేరుతో కొంతమంది బాధించడం స్వయంగా చూసింది. అందుకే వాళ్ల ఆవేదనను అందరికీ తెలిసేలా చేయాలని నిర్ణయించుకుంది. రచనలో ఎలాంటి అనుభవం లేకున్నా తను చూసిన సంఘటనల ప్రేరణతో రచయిత్రిగా మారింది.
అన్ని రంగాల్లో మహిళా సాధికారత మరింత పెరగాలి : శైలజా కిరణ్
వితంతువుల సమస్యలను పుస్తక రూపంలో ప్రపంచానికి తెలియజెప్పాలని సౌమ్య 5 ఏళ్ల క్రితమే నిశ్చయించుకుంది. వివక్ష వల్ల వాళ్లు అనుభవించే నరకయాతన, అందుకు పరిష్కార మార్గాలు ఈ పుస్తకంలో పొందుపరచాలనుకుంది. అధ్యయనంలో భాగంగా కొంతమంది వితంతువులు, న్యాయనిపుణులు, వేద పండితులు, ఆధ్యాత్మికవేత్తలను కలసింది. మానసిక నిపుణులతో చర్చించి ఎన్నో విషయాలను సేకరించింది. వాటి ఆధారంగా "ది పాలిష్డ్ ఇన్ హ్యూమన్ ట్రీట్‌మెంట్ ఫ్రమ్ షాడోస్ టు స్పాట్‌లైట్" బుక్‌ను విడుదల చేసింది.
గతంలో కంటే నేడు స్త్రీలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారని, కానీ రూపు మార్చుకున్న కొన్ని దురాచారాల వల్ల భర్త చనిపోయిన స్త్రీలు వివక్షకు గురికావడం ఆందోళనకరమని అంటోంది సౌమ్య. ఈ పుస్తకానికి "ది పాలిష్డ్ ఇన్ హ్యూమన్ ట్రీట్‌మెంట్" అనే పేరే ఎందుకు ఎంచుకుందో వివరిస్తోంది.
షబ్నిమ్ వరల్డ్ రికార్డ్- మహిళల క్రికెట్లో ఫాస్టెస్ట్ బంతి
సమాజంలో చాప కింద నీరులా కొనసాగుతున్న వివక్ష వల్ల కొందరు స్త్రీలు ఇంటికే పరిమితమవుతున్నారని, అలాంటి వారిలో ఆత్మస్థైర్యం నింపాలనేదే తన లక్ష్యం అంటోంది సౌమ్య. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు తెచ్చే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రాశానని చెబుతోంది. విజయవాడ పీబీ సిద్ధార్థ కాలేజీలోని బుక్ క్లబ్ ఆధ్వర్యంలో తన బుక్‌ను ఆవిష్కరించింది సౌమ్య.
అందరూ సర్వసాధారణమని భావించే సంఘటనల వెనక ఎంత ఆవేదన ఉందో కళ్లకు కట్టేలా ఈ రచన ఉందని అంటున్నారు కళాశాల సిబ్బంది, విద్యార్థులు. వితంతువులపై ఆచారాల పేరుతో అమానవీయ చర్యలకు పాల్పడుతున్న వారిలో మార్పు తెచ్చేందుకే ఈ పుస్తకం రాశానంటోంది సౌమ్య. అవకాశం వస్తే మరిన్ని పుస్తకాలు రాస్తానని, ప్రస్తుతం సీఏ పూర్తిచేయడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టానని చెబుతోంది.