Fake Phonepe Man Suicide in Peddapalli : పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుమ్మనూరు గ్రామంలో బండారి రాజ్ కుమార్ (22) అనే యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. సోమవారం ఓ జిరాక్స్ సెంటర్లో ఫేక్ ఫోన్‌పేతో మోసం చేస్తూ పట్టుబడిన ఆ యువకుడు, మంగళవారం ఉదయం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రాజ్‌కుమార్ ఆదివారం రోజున మంథనిలోని త్రినేత్రి ఆన్‌లైన్ అండ్ జిరాక్స్ సెంటర్‌కు వెళ్లి, ఫోన్‌పే చేసి కొంత నగదు తీసుకున్నాడు. సోమవారం సైతం అదే దుకాణానికి వెళ్లి, మళ్లీ ఫోన్ పే చేసి డబ్బులు ఇవ్వమని కోరాడు.
షాప్ నిర్వాహకుడు తన ఫోన్‌పే చెక్ చేయగా, డబ్బులు రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రాజ్‌కుమార్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. అనంతరం నేడు మళ్లీ స్టేషన్‌కు రావాలని చెప్పి ఇంటికి పంపించారు. అయితే నకిలీ ఫోన్ పే ద్వారా రాజ్‌కుమార్ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడిని మోసం చేయబోయాడన్న విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో అవమానం భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
'తమ్ముడు పోలీస్ స్టేషన్లో ఉన్నాడని నా కుమార్తె నాకు ఫోన్ చేసింది. వెంటనే అక్కడికి వెళ్లి ఏమైందని అడిగా. ఫేక్ ఫోన్‌పే వాడుతున్నాడని చెప్పారు. ఏమైనా ఉంటే మాకు సమాచారం ఇవ్వాలి కానీ సెల్లో ఎందుకు పెట్టారని అడిగా. నన్ను కొట్టారని మా అబ్బాయి నాకు చెప్పాడు. ఫోన్ పేతో మోసం చేశాడంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.' - మృతుని తల్లి
వాళ్లపై మృతిని తల్లి ఫిర్యాదు : మృతుని తల్లి తిరుమల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మంథని సీఐ రాజు తెలిపారు. త్రినేత్రి ఆన్‌లైన్ అండ్ జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడితో పాటు ఏకే న్యూస్ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకునిపై ఫిర్యాదు ఇచ్చినట్లు చెప్పారు. కేసుకు సంబంధించిన దర్యాప్తును పూర్తి చేసి మరోసారి పూర్తి వివరాలను వెల్లడిస్తామని సీఐ తెలిపారు.
'రాజ్ కుమార్ అనే యువకుడు త్రినేత్రి ఆన్‌లైన్ అండ్ జిరాక్స్ సెంటర్‌కు వెళ్లి ఫేక్ ఫోన్‌పే ద్వారా రూ.300 పంపించాడు. మళ్లీ మరుసటి రోజు అదే ఫేక్ యాప్‌తో రూ.500 పంపించాడు. ఈ క్రమంలో జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడికి అనుమానం వచ్చి ఆ యువకుడిని పట్టుకుని మాకు అప్పగించాడు. విచారణలో ఫేక్ ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపిస్తూ మోసం చేస్తున్నాడని తేలింది. ఈ విషయం అక్కడే ఉన్న ఏకే న్యూస్ ఛానల్ ద్వారా వైరల్ అయింది. దీంతో ఆ యువకుడు అవమానం భరించలేక మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు' - రాజు, మంథని సీఐ