Yeleru Reservoir Flood Effect: కాకినాడ జిల్లాలో భారీ వర్షాలకు వాగులు , వంకలు పొంగి పొర్లుతున్నాయి. మెట్ట ప్రాంతంలో జలాశయాలు నిండుకుండగా మారాయి. ఏలేరు, చంద్రబాబు సాగర్, సుబ్బారెడ్డి సాగర్ పూర్తిగా నిండి ఊళ్లను ముంచెత్తుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి బాధితులకు అండగా నిలిచారు.
భారీ వర్షాలు కాకినాడ జిల్లాపై తీవ్ర ప్రభావం చూపాయి. ఏలేశ్వరం మండలం ఏలేరు జలాశయానికి వరద పోటెత్తింది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా 23.25 టీఎంసీలకు నీరు చేరింది. కాల్వలకు 27 వేలకుపైగా క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. దీంతో ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం అయ్యాయి.
గొల్లప్రోలు, పిఠాపురం మధ్య వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కిర్లంపూడి మండలంలోని రాజుపాలెం - ముక్కోలు వద్ద ఏలేరు కాల్వకు గండిపడి వేల ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. రాజుపాలెం ఎస్సీ కాలనీని వరద నీరు చుట్టుముట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల కోసం ఎర్రవరంలో ప్రభుత్వం పునరావాస కేంద్రం ఏర్పాటు చేసింది.
పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఏలేరు వరదతో ముంపునకు గురైన ప్రాంతాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించారు. పడవలో వెళ్లి జగనన్న కాలనీలోని బాధితులను పరామర్శించారు.
"ఈ కాలనీ 32 ఎకరాల స్థలం ఇది. 2 వేలకుపైగా లబ్ధిదారులు ఉన్నారు. ప్రస్తుతం ఇందులో పది శాతం మంది మాత్రమే ఉన్నారు. ఈ కాలనీలో డ్రైనేజీ కానీ, రోడ్లు కానీ ఏమీ లేవు. దీని మార్కెట్ విలువ 30 లక్షల రూపాయలు అయితే, దీనిని కూడా 60 లక్షలకు పైగా పెట్టి కొన్నారు. 13 కోట్ల రూపాయలు కేవలం ఈ ఒక్క కాలనీకి మాత్రమే వృథా చేశారు. ఈ డబ్బులు ఎలా దుర్వినియోగం అయ్యాయో తెలుసుకుంటే, కాలనీలో సదుపాయాలు కల్పించొచ్చు". - పవన్ కల్యాణ్, ఉప ముఖ్యమంత్రి
బురదలో నడుస్తూ ప్రజా సమస్యలు విన్నారు. కిర్లంపూడి మండలం భూపాలపట్నం,S. తిమ్మాపురం, శృంగరానిపాలెంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పర్యటించి ప్రజల్ని అప్రమత్తం చేశారు. ఏళేశ్వరం మండలం ఎర్రవరంలోని పునరావాస కేంద్రాన్ని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పరుపుల సత్యప్రభ పరిశీలించారు. పునరావాస కేంద్రంలో బాధితులకు ఆహారం, తాగునీటి బాటిళ్లు అందించారు.