YCP Main Leaders Are Resigning One By One at Nellimarla: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసీపీలోని ప్రధాన నాయకులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఆదివారం భోగాపురం మండలానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, వైసీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ బడాకొండగా మారి జిల్లాలోని కొండలను అనకొండలా మింగేస్తున్నారని శ్రీనివాసరాజు ఆరోపించారు. ఆయనతో పాటు మరో 50 మంది నాయకులు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరాజు విలేకరులతో మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయ పరిచి ఎమ్మెల్యే విజయానికి కృషి చేశానన్నారు.
'మా కుటుంబ గౌరవం నిలబెట్టుకోవాలనుకుంటున్నా- వైసీపీకి రాజీనామా చేస్తున్నా'
ఇప్పుడు తనతో పాటు, కేడర్‌కు కూడా తగిన గుర్తింపు ఇవ్వకుండా అవమానపరుస్తున్నారని ఆయన వాపోయారు. ఎమ్మెల్యే బడ్డుకొండ అవినీతిలో ప్రథమస్థానం సాధించి కొండల ఆక్రమణ, అక్రమ క్వారీల నిర్వహణ, ఇసుక దందాల్లో ప్రమేయం ఉందని ఆరోపించారు. పది రోజుల్లో నియోజకవర్గంలోని వైసీపీ కేడర్ అంతా ఖాళీ అవడం ఖాయమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పార్టీ ఉంటుందని భావించానని ఆయన అన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న నీచరాజకీయాలతో ఆయన ఆత్మ కూడా శాంతించదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన వెంట భోగాపురం పంచాయతీలోని ముంజేరు, దిబ్బలపాలెం, కవులవాడ తదితర ప్రాంతాల నాయకులున్నారు.
వైఎస్సార్సీపీకి మరో షాక్, మంత్రి గుమ్మనూరు రాజీనామా - "జగన్ గుడిలో విగ్రహం లాంటివారు!"
ఇటీవల శృంగవరపుకోట నియోజకవర్గంలో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బ తగలింది. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు వర్గం పార్టీని వీడేందుకు సిద్ధమైంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య విభేదాలే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు విజయం కోసం చాలా కష్టపడి పనిచేశామని తమను మాత్రం పట్టించుకోవట్లేదంటూ ఎమ్మెల్సీ చాలా కాలంగా అసంతృప్తితో ఉన్నారు.
పార్టీ పదవులు, ప్రభుత్వ నియామక పదవుల్లో కనీస ప్రాధాన్యం లేదంటూ రెండు సంవత్సరాల క్రితమే వారు అసమ్మతి గళం వినిపించారు. ఈ మధ్య కాలంలో వారందరి మధ్య అధిపత్య పోరు మరింత తీవ్రమైంది. ఎమ్మెల్యే కడుబండికి ఈ సారి టికెట్టు ఇవ్వొద్దని, ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని తీర్మానాలు చేసినా అధిష్ఠానం పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య విభేదాలకు తెరదించాలని పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గౌరవం లేని చోట ఉండలేక గుర్తింపు ఇచ్చే పార్టీలోకి వెళ్లడమే రాజకీయంగా మేలని రఘురాజు వర్గం భావించినట్లు తెలుస్తోంది.