YCP Leaders Frauds in Kurnool District Cooperative Central Bank : ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రైతులకు ‘సహకారం’ అనే మాటే కొరవడింది. బ్యాంకులో పెత్తనం చేసి అయినవారికి అప్పనంగా రుణాలిచ్చారు. వసూళ్లలో చేతులెత్తేయడంతో బ్యాంకు నష్టాలబాటలో పయనించింది. బ్యాంకు నిరర్ధక ఆస్తులు కొండలా పెరిగిపోయి కోలుకోలేని పరిస్థితి నెలకొంది. 2020-21, 2021-22, 2022-23 సంవత్సరాల్లో కర్నూలు జిల్లా సహకార బ్యాంకు వరుసగా రాయలసీమలోనే ఉత్తమ బ్యాంకుగా ఎంపికై అవార్డులను సొంతం చేసుకుంది. 2023-24లో ఆ పరిస్థితి కానరావడం లేదు.
సహకార సంఘాల్లో జేబు దొంగలు పడ్డారు: అచ్చెన్నాయుడు - revival of cooperative societies
కక్ష గట్టి సీఈవోకు పొగ : ఉమ్మడి కర్నూలు జిల్లాలో 54 మండలాల పరిధిలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు విస్తరించింది. ఏటా రూ. 3 నుంచి 4 వేల కోట్ల టర్నోవర్‌తో లాభాల్లో ఉన్న బ్యాంకు గత వైసీపీ పాలకుల స్వార్థ నిర్ణయాలతో నష్టాల ఊబిలో చిక్కుకుంది. 2022-23లో రూ.11 కోట్ల వరకు ఆదాయం గడించింది. అందులో రూ.5 కోట్లను డివిడెంట్లుగా 99 ప్రాథమిక సహకార సంఘాలకు ఇచ్చారు. 2023-24లో రూ.1.68 కోట్ల లాభాలే వచ్చాయి. రైతులకు కాకుండా జేఎల్‌జీ గ్రూపులకు రుణాలివ్వడాన్ని అడ్డుకున్న అప్పటి సీఈవోకు గత పాలకులు పొగపెట్టారు. దీంతో ఆయన 2023-24 జనవరిలో రాజీనామా చేశారు. 2025 వరకు కొనసాగాల్సిన ఆయన్ను ముందే సాగనంపారు. సీఈవోను తప్పించాలంటే ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత చర్యలు తీసుకోవాలి. లేదా ముందస్తుగా ఆర్‌బీఐ, నాబార్డు అనుమతి తీసుకోవాలి. ఇవేవీ పట్టించుకోకుండా వైసీపీ స్వార్థ ప్రయోజనాల కోసం తప్పించారు. ఫలితంగా బ్యాంకు కార్యకలాపాలను పర్యవేక్షించేవారు కరవయ్యారు. వైఎస్సార్సీపీ నేతలకు అడ్డగోలుగా ఇచ్చిన రుణాలు తిరిగి వసూలు చేయలేకపోయారు.
GDCCB: డీసీసీబీ సొసైటీల్లో అక్రమాలపై చర్యలకు పాలకవర్గం తీర్మానం
రుణాల రికవరీ మరిచిన అధికారులు : గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో వారి అనుయాయులకు సహకార బ్యాంకులో ఇష్టారాజ్యంగా రుణాలిచ్చారు. వారు తిరిగి సకాలంలో చెల్లించలేదు. అప్పటి అధికార పార్టీకి చెందినవారు కావడంతో అధికారులూ సైతం గట్టిగా అడగలేకపోయారు. దీంతో ఏటా నిరర్ధక ఆస్తులు పెరుగుతూ వచ్చాయి. 2021-22లో ఎన్‌పీఏ 3.28 శాతం ఉండగా, 2022-23లో 3.23 శాతానికి తగ్గింది. 2023-24లో 4.50 శాతానికి పెరగడం గమనార్హం. 2023-24లో ఏకంగా రూ.70 కోట్లకు పైగా నిరర్ధక ఆస్తులు పెరిగిపోయాయి. గతంలో రూ.125 కోట్ల మేర నిరర్ధక ఆస్తులుండగా గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి రూ.200 కోట్లకు చేరడం గమనార్హం.
గత పాలకుల సొంత లాభం : సహకార బ్యాంకు ఛైర్మన్ కుర్చీలో కూర్చున్న గత పాలకులు వ్యక్తిగత లాభం కోసం బ్యాంకును నష్టాల్లోకి తీసుకెళ్లారన్న ఆరోపణలున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్న ఉద్దేశంతో రైతులను కాదని తమ అనుచరవర్గానికి రుణాలు ఇవ్వాలంటూ బ్యాంకు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. నాలుగు వేల జేఎల్‌జీ గ్రూపులకు రూ.40 కోట్ల రుణాలు మంజూరు చేయించేందుకు ప్రయత్నించారు. దీనికి నాబార్డు, సహకార శాఖ ససేమిరా అన్నాయి. బ్యాంకు నిరర్ధక ఆస్తులపై దృష్టి పెట్టలేదు. రుణ వసూళ్లకు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఫలితంగా అప్పుల కుప్ప పేరుకుపోయింది.