YCP Leaders Attack A Family in Visakha: గురువారం విశాఖ బర్మా కాలనీకి చెందిన ఓ కుటుంబంపై జరిగిన ఉదాంతం రాష్ట్ర ప్రజలను నివ్వెరపోయేలా చేసేది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు సైతం దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ ఘటనను చూసి రాష్ట్ర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. బర్మా కాలనీకి చెందిన ఓ కుటుంబంపై వైసీపీ శ్రేణులు చేసిన దాడిని కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. కూటమికి ఓటు వేశారన్న కక్షతో వైసీపీ శ్రేణుల దాడికి గురైన బాధిత కుటుంబాన్ని బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు, జనసేన నాయకులు, మహిళా నేతలు పరామర్శించారు. కుటుంబ గొడవంటూ పోలీసులు దాడి ఘటనను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆక్షేపించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తాడిపత్రిలో బరితెగించిన వైసీపీ కార్యకర్తలు - బాలింత అని చూడకుండా - YCP Leaders Attack
దాడి ఎలా జరిగిందో దానికి సంబంధించిన పూర్తి వివరాలను బాధిత కుటుంబం మీడియాకు వివరించింది. దాడి సందర్భంగా బాధితుల ఇంట్లో పరిస్థితి వారి ఆర్తనాదాలు రికార్డైన వీడియోను బాధిత కుటుంబం, నాయకులు మీడియాకు చూపించారు. ఎన్నికలు ముందు నుంచి బర్మ కాంప్‌లో గొడవలు జరుగుతున్నాయని బాధితురాలు నూకరత్నం అన్నారు. కూటమికి ఓటు వేశామన్న విషయం తెలుసుకుని కావాలనే దాడికి పాల్పడ్డారని ఆమె తెలిపారు. వైసీపీకి మద్దతుగా ఉండట్లేదని సొంతింట్లోనే ఉండకుండా చేస్తున్నారని బాధితురాలు, తల్లి సుంకర ధనలక్ష్మి వాపోయారు.
బొగ్గు శ్రీను అనే వ్యక్తి వల్ల గొడవలు జరుగుతున్నాయని వెంటనే అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలి. మా ఇంటి వద్దకు వచ్చి గొడవ చేసి మమ్మల్నే తిట్టారు. కొందరు వచ్చి నా తల, కాళ్లపై కొట్టి సినిమా మాదిరిగా మాపై దాడులు చేశారు. నా చెల్లి గర్భిణి ఆమె కడుపుపై రెండుసార్లు తన్నారు. వాళ్లు అసలు మనుషులేనా? ఓటు ఎవరికి వేయాలనేది మా ఇష్టం. రాత్రి 10 గంటలకు పోలీసులు వచ్చి కొందరు వ్యక్తులను తీసుకెళ్లారు. ఈ ఘటనలో కొందరు నిందితులను వదిలేసినట్లు తెలుస్తోంది. దాడి చేసిన సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను పోలీసులకు ఇస్తాం. బర్మా క్యాంప్‌నకు ప్రచారానికి ఇతరులు ఎవరూ రాకుండా చూశారు. -బాధితురాలు, నూకరత్నం
వైసీపీ నేతలు నిండు గర్భిణీ అయిన సుంకర రమ్యపై విచక్షణ రహితంగా దాడి చేశారని జనసేన మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా పోలీసులు వైసీపీ నేతలకు కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. ఘటనపై కనీస దర్యాప్తు కూడా జరపకుండా పోలీసులు కుటుంబ తగాదాగా ఎలా నిర్ధారిస్తారని జనసేన నాయకులు ప్రశ్నించారు.