Govt Delaying Payments For Pending Bills: ఐదేళ్లలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ తరహా సేవల్ని అందుబాటులోకి తెచ్చామని, పదేపదే చెప్పే సీఎం జగన్, రోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. వారికి నాణ్యమైన ఆహారం అందించడంలో దారుణంగా విఫలమయ్యారు. రాష్ట్రంలో వివిధ పనులు చేసిన గుత్తేదారులకు కోట్లలో బిల్లుల పెండింగ్ పెట్టిన సర్కారు అదేకోవలో ఆసుపత్రుల్లోని రోగులకు భోజనాలు అందిస్తున్న గుత్తేదారులకు కూడా ఏడాదిన్నరగా బిల్లులు చెల్లించడంలేదు. ఇవేవో వందలు, వేల కోట్ల రూపాయలు ఉన్నాయంటే అదీ కాదు, అన్నీ కలిపి రాష్ట్రవ్యాప్తంగా 25 కోట్లు మాత్రమే. ఇవి విడుదల చేయడానికి ముఖ్యమంత్రికి తీరిక లేకుండా పోయింది.
ఏ ఆసుపత్రిలో చూసినా చాలీచాలని అల్పాహారం, ఉడికీ ఉడకని అన్నం, నీళ్లలాంటి కూరలు, సాంబారే అందుతున్నాయి. తక్కువ ధరకు అందుబాటులో ఉండే కూరగాయలతోనే వంటలు తయారవుతున్నాయి. ఫలితంగా చికిత్స పొందుతున్న రోగులు కోలుకునే సమయం పెరుగుతోంది. కానీ నెలల తరబడి ప్రభుత్వం నుంచి చెల్లింపులు నిలిచిపోతే నాణ్యమైన ఆహారాన్ని ఎలా అందించగలమంటూ గుత్తేదారులు ప్రశ్నిస్తున్నారు. ఇన్‌పేషెంట్లకు పోషకాహారం అందించేందుకు ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం సరఫరా చేయాలి. ప్రతిరోజూ ఒక గుడ్డు, అరటిపండు ఇవ్వాలి. షుగర్ బాధితులకు రాగి సంగటి పెట్టాలి. ఇందుకు ఒక సాధారణ రోగికి రోజుకు 80 రూపాయలు, బాలింతలకు 100రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.
మెనూ అమలుపై అధికారుల పర్యవేక్షణ కరువైంది. వంట గదుల పరిశుభ్రత, కూరగాయలు, బియ్యం, పప్పులు, నూనెల నాణ్యతను వైద్యాధికారులు నిత్యం పరిశీలించాలి. వీరు రుచి చూసిన తర్వాతే రోగులకు భోజనం పంపిణీ జరగాలి. ఆచరణలో ఇవేమీ జరగడంలేదు. గుంటూరు GGH, తిరుపతి రుయా ఆసుపత్రి, నరసరావుపేట, పాడేరు, భీమవరం, అనకాపల్లిలోని జిల్లా ఆసుపత్రి, నర్సీపట్నం, గుడివాడ, బాపట్ల, చీరాల, జంగారెడ్డిగూడెం, చింతలపూడి ఆసుపత్రుల్లో నాణ్యమైన భోజనం అందడం లేదు. మచిలీపట్నం, విజయనగరం ప్రాంతీయ ఆసుపత్రి, ఏలూరులోని సర్వజన ఆసుపత్రి, అవనిగడ్డలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలోనూ ఇదే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
సమస్యలకు నిలయాలుగా డయాలసిస్ సెంటర్లు!- ఏసీల్లో ఎలుకలు - Problems at Dialysis Centre
అన్ని ఆసుపత్రుల్లోనూ అల్పాహారంగా ఎక్కువగా పులిహోర, కిచిడీ, ఉప్మా పెడుతున్నారు. ఉదయం పలుచటి పాలు అందిస్తున్నారు. భోజనంలో చిమిడిన అన్నం, రుచీపచి లేని కూరలు, పప్పే కనిపించని నీళ్లలాంటి సాంబారు ఇస్తున్నారు. మజ్జిగ సైతం నీళ్లలా ఉంటోంది. మధ్యాహ్నం ఇస్తున్న అరటిపండ్లు, గుడ్లు పరిమాణంలో చిన్నగా ఉంటున్నాయి. ఖర్చు తగ్గించుకునేందుకు గుత్తేదారులు సిబ్బందిని తగ్గించడంతో, భోజన వడ్డనకు వేళలు పాటించడంలేదు. ఒక్కోసారి అల్పాహారం ఉదయం 11న్నర గంటలకు, మధ్యాహ్నం భోజనం ఒకటిన్నర తర్వాత అందిస్తున్నారు. ఈ కారణంగా వార్డుల్లోని 20శాతం మంది రోగులకు భోజనం అందడం లేదు. దీనికి తోడూ వడ్డనలోనూ వేగం పెంచి, కంచంలో ఒకేసారి అన్ని ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారు. దాంతో రోగులకు తక్కువ పరిణామంలో ఆహారం అందుతోంది. కొన్నిచోట్ల 50 నుంచి 60 మందికే వండుతూ వంద మందికి సరిపెడుతున్నారు. ప్రసూతి ఆసుపత్రుల్లో బాలింతలకు ప్రత్యేక మెనూ పాటిస్తున్న దాఖలాలు కనిపించడంలేదు.
తిరుపతి రుయా ఆసుపత్రిలో డైట్ కాంట్రాక్టరుకు ప్రభుత్వం కోటి 50లక్షల బకాయిలు రావల్సి ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ఆసుపత్రుల గుత్తేదారులందరికీ కలిపి 2 కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది. మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో వైసీపీ చెందిన ఓ బడా గుత్తేదారు నుంచి సబ్ కాంట్రాక్టు తీసుకున్న ఉప గుత్తేదారుకు నెలకు 5లక్షల వరకు ఖర్చు అవుతోంది. 2022 డిసెంబరు నుంచి ఇప్పటి వరకు 70 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. గుడివాడ ప్రాంతీయ ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. అనకాపల్లి జిల్లా ఆసుపత్రి గుత్తేదారుకు కోటి 25లక్షలు చెల్లించాల్సి ఉంది. విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి,ఘోష ఆసుపత్రి కలుపుకుని కాంట్రాక్టరుకు మొత్తంగా కోటి 9లక్షల వరకు, మన్యం జిల్లాలోని వారికి 40 లక్షల వరకు చెల్లింపులు పెండింగులో ఉన్నాయి.