YCP Government Neglect Roads Construction: రాష్ట్రంలోని రహదారుల గురించి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జనాల ప్రాణాలకు భద్రత, భరోసా కల్పించాల్సిన నేతలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తు బలిపీఠం ఎక్కిస్తున్నారు. రహదారులు గుంతలమయమై వాటిలో పడి ప్రాణాలు కోల్పోతున్నా వారివి అసలు జీవితాలే కాదు అన్నట్లు నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తున్నారు. పైగా మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరితే మోకాలికి బోడిగుండుకు లంకె పెడుతున్నారు. కొన్ని పథకాలకు డబ్బులు ఆపితే రహదారులను అద్దంగా మెరిపించొచ్చు అంటూ చులకన చేసి మాట్లాడుతున్నారు.
వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపి ప్రాణాలు కోల్పోతే అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందనుకోవచ్చు. కానీ అత్యంత అధ్వాన రహదారులపై ఉన్న గుంతల్లో పడి నిండుప్రాణాలు పోతే అది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే! గుంతలు కూడా పూడ్చలేని చేతకాని సర్కారుదే ఆ పాపం కానీ జగన్ ప్రభుత్వం మాత్రం రహదారుల మరమ్మతులకు వక్రభాష్యం చెబుతూ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. గుంతలు పూడ్చక కుటుంబాలకు కుటుంబాలనే విషాదంలోకి నెట్టేస్తోంది.
మూడేళ్లుగా నరకం చూస్తున్న ప్రజలు - రాళ్లు తేలిన రోడ్డుపై ప్రయాణమంటేనే హడల్
‘జగన్ మామ’ పుణ్యమా అని కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలయ్యారు. ‘అన్నా' అని ఆదరించిన పాపానికి ఎంతోమంది చెల్లెమ్మలు తమ భర్తను కోల్పోయి పసుపు, కుంకుమలకు దూరమయ్యారు. ఎదిగొచ్చిన బిడ్డలను కోల్పోయి వృద్ధులు తోబుట్టువులను కోల్పోయి అన్నాదమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లు ఇలా జగన్ ప్రభుత్వ నిర్లిప్తత ఎంతోమంది అనుబంధాలు, ఆత్మీయతలను దూరంచేసింది. ఎందరి జీవితాల్నో కకావికలం చేసేసింది. ఎన్నో కుటుంబాల కన్నీటిగాథలకు కారణభూతమైంది.
రాష్ట్రంలో గత జూన్-డిసెంబరు మధ్య కురిసిన వర్షాలతో రహదారులు ఛిద్రమయ్యాయి. ఏటా 9,000 కి.మీ.ల రహదారులను రెన్యువల్ చేయాల్సిన ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క ఏడాది మాత్రమే 7,600 కి.మీ. వరకు చేసి చేతులు దులిపేసుకొంది. రాష్ట్రంలో 45 వేల కిలోమీటర్ల మేరకు ఉన్న Rఅండ్B రోడ్లలో మరీ ఘోరంగా తయారైన 26 వేల కిలోమీటర్ల మేరకు తక్షణమే బాగుచేయాలని ఆశాఖ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కనీసం రోడ్లపై గుంతలు పూడ్చితే వాహనదారులకు ఇబ్బంది ఉండదని తెలిపింది. అయినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదంటే ప్రజల ప్రాణాలపై వైసీపీ సర్కారుకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరోసారి జగన్ వివక్ష - సొంత వారికే సొమ్ములు - మిగతా వారికి గోతులు
Srikakulam District: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మాకివలస గ్రామానికి చెందిన తోటాడ సింహాచలం రజక వృత్తితో జీవనం సాగించేవారు. 2022 జనవరి 4న మాకివలస-కిల్లాం రోడ్డుపై ద్విచక్రవాహనంపై వెళ్తున్న సింహాచలం రహదారి గుంత కారణంగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు అనాథలయ్యారు. పని చేస్తేగానీ ఇల్లు గడవని కుటుంబం కావడంతో లక్ష్మి తన భర్త చేసే వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
Parvathipuram Manyam District: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నుంచి జాతీయ రహదారి మీదుగా సాలూరు, మక్కువ మండలాలకు చెందిన 15గ్రామాలకు వెళ్లే రహదారి ఇది. ఈ మార్గం సాలూరు మండలం గదబ బొడ్డవలసకు చెందిన లారీ డ్రైవర్ సురేష్ కుటుంబాన్ని దిక్కులేనివారిని చేసింది.
అడుగుకో గుంతతో ప్రజల పాట్లు - అధ్వానంగా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రోడ్లు
Palnadu District: పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన రామాంజమ్మ, బత్తిన ఆనంద్‌కు పదేళ్ల క్రితం వివాహమైంది. గృహోపకరణాల వస్తువులు వాయిదాపై ఇచ్చే వ్యాపారి వద్ద ఆనంద్ పనిచేసేవారు. ముగ్గురు పిల్లలు ఉండగా, నాలుగో ప్రసవం కోసం గత యేడాది అక్టోబరు 20న రామాంజమ్మను ఆసుపత్రికి తీసుకెళ్లే క్రమంలో వెనుక బైక్‌పై వచ్చిన ఆనంద్ రోడ్డు గుంత వల్ల ప్రమాదానికి గురై చనిపోయాడు. పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా బండి నడుపుతూ ప్రమాదానికి గురయ్యాడని రాయడంతో ఎలాంటి సాయం అందలేదు. ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో నలుగురు పిల్లలను ఎలా పోషించాలో తెలియడం లేదని రామంజమ్మ వాపోతున్నారు. సొంతిల్లు కూడా లేకపోవడంతో దాచేపల్లి రోడ్డులోని ఎస్సీ కాలనీలో ఖాళీ స్థలాన్ని అద్దెకు తీసుకొని అందులో గుడారం వేసుకుని అత్త తెచ్చే కూలి డబ్బులతోనే జీవనం సాగిస్తున్నారు.
Krishna District: కృష్ణా జిల్లా కోడూరు మండలం బడేవారిపాలెం గ్రామానికి చెందిన ఇంటర్ యువకుడు వేణుగోపాల్ జనవరి 5న రాత్రి 8 గంటల సమయంలో బైక్‌పై వెళ్తుండగా రోడ్డు గుంతల వల్ల ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన యువకుడిని ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు నిలవలేదు. వేణుగోపాలరావు తండ్రి 11 ఏళ్ల క్రితం మృతి చెందారు. తల్లి సాయిశైలజ తన ఇద్దరు కుమారులతో కలిసి పుట్టింటిలో ఉంటోంది. కొడుకులిద్దరూ ఎదిగొచ్చి కష్టాలు తీరుతాయని ఆశలుపెట్టుకుంది. ఇంతలో గుంత వల్ల జరిగిన ప్రమాదంలో రెండో కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఛిద్రమైన రహదారులను బాగుచేయకుండా వైసీపీ ప్రభుత్వం వహిస్తున్న నిర్లక్ష్యం కారణంగా నిత్యం ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి.