YCP Govt Imposing High Taxes on People of Vijayawada: విజయవాడ నగరపాలక సంస్థ విచ్చలవిడిగా పన్నులు పెంచుతూ ప్రజల నడ్డివిరుస్తోంది. వైసీపీ పాలనలో ఆస్తిపన్ను, ఖాళీ స్థలాల పన్ను, చెత్తపన్ను, ఇంటిపన్ను భారీగా పెంచి సామాన్యులను పీల్చిపిప్పి చేస్తోంది. మూడేళ్ల వ్యవధిలోనే సుమారు 328కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపి ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పన్నుల బాదుడుపై నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘నవరత్నాల’తో మురిపిస్తామంటూ మాయమాటలు - పింఛన్ తొలగించి పేదలకు వంచన - Jagan Conditions on Pensions
వైసీపీ పాలనలో పన్నుల భారాలపై విజయవాడ నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మూడేళ్ల వ్యవధిలో నగర ప్రజలపై ఆస్తి పన్ను మీదే ఏకంగా 67.59 కోట్ల రూపాయల వరకూ భారం మోపారు. ఏటా 15శాతం చొప్పున ఆస్తి పన్ను పెంచుకుంటూ పోయారు. ఆస్తిపన్ను భారం చాలదన్నట్టు యూజర్ ఛార్జీల పేరుతోనూ భారం మోపారు. 2024- 2025 ఆర్థిక సంవత్సరంలో యూజర్ ఛార్జీలు 18కోట్ల రూపాయలు వసూలు చేయాలని పాలక మండలి లక్ష్యంగా పెట్టుకుంది. కొన్ని కాలనీల్లో కార్పొరేషన్ సిబ్బంది పింఛన్ల నుంచి యూజర్ ఛార్జీలను మినహాయించుకుని మిగిలిన నగదును లబ్ధిదారులకు చెల్లిస్తున్నారు. మరికొన్ని చోట్ల సంక్షేమ పథకాల్లో కోత విధిస్తామని బెదిరించి మరీ ప్రజల నుంచి వీఎంసీ సిబ్బంది చెత్తపన్ను వసూలు చేశారు.
విజయవాడ నగరాభివృద్ధిపై గత తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి నిధులు విడుదల చేసింది. జగన్ ప్రభుత్వం కొలువుదీరాక నగర అభివృద్ధికి నిధులు కేటాయిస్తామన్న హామీలే తప్ప ఆ మాటలు ఆచరణకు నోచుకోలేదు. దీంతో నగరపాలక సంస్థ భారీగా పన్నులు పెంచేస్తూ నిధులు సమకూర్చుకుంటోంది. ఒకవైపు ఆస్తిపన్ను పెంచుతూ మరోవైపు ఖాళీ స్థలాలు, నీటిపన్ను, భూగర్భ డ్రైనేజీ పన్నులను సైతం భారీగా పెంచేశారు. పెరిగిన పన్నులు కట్టలేక ఖాళీ స్థలాల యజమానులు చిరునామాలు సైతం మార్చేసి తిరుగుతున్నారు. విరామం లేకుండా భారాలు మోపుతున్నారని నగరవాసులు మండిపడుతున్నారు. ప్రజలపై భారీగా భారం వేసి పీడించకుండా నగరపాలక సంస్థ ఇతర ఆదాయ మార్గాలను అన్వేషించాలని సంపద సృష్టిపై దృష్టి సారించాలని సామాన్యులు కోరుతున్నారు.
ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ప్రజలను నమ్మబలికి ఓట్లు వెయ్యించుకున్న జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఓట్లు వేసిన పాపానికి ఆ ప్రజలను పన్నుల పేరుతో ఎడాపెడా మోత మోగిస్తున్నారు. తాము ఈ ఆర్థిక భారం మోయలేము మహా ప్రభో అని ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు ఆవేదన వ్యక్తం చేసినా వారి బాధను పెడచెవిన పెట్టి పన్నుల మోత మోగిస్తునే సీఎం జగన్ ఐదేళ్ల పాలన సాగించేశారు. గత నాలుగేళ్లు పన్నుల మోతతో విసుగెత్తిపోయిన ప్రజలు మరో నెల రోజుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్ సర్కార్ కి ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ప్రభుత్వం ప్రజలపై భారాలు వెయ్యకుండా పాలన సాగించాలని కోరుతున్నారు. ప్రజలపై భారీ స్థాయిలో భారాలు వేసి పీడించకుండా ఇతర ఆదాయ మార్గాలను ప్రభుత్వం అన్వేసించాలని సంపద సృష్టిపై దృష్టి సారించాలని సామాన్యులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.