MP Nomination with Coins in Karimnagar : ఉన్నత చదువులు చదివిన ఆమె అతిచవక ఖర్చుతో ఇంటిని నిర్మిస్తామంటూ అంతముందు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పేరాల మానస రెడ్డి, ప్రస్తుతం రాజకీయాల్లోకి రావడమే ఓ చర్చగా మారింది. మరోవైపు ఆమె నామినేషన్ వేసేందుకు వెళ్లిన తీరు కూడా అందరినీ ఆశ్యర్యపరిచింది. నామినేషన్ పత్రాలు, ప్రతిపాదన చేసిన వారితో మాత్రమే అభ్యర్థులు ఎన్నికల అధికారి వద్దకు చేరుకుంటారు. కానీ పేరాల మానసరెడ్డి మాత్రం అదనంగా ఓ గంపను కూడా వెంట తీసుకెళ్లారు.
కరీంనగర్ లోక్‌సభ స్థానానికి సైదాపూర్ మండలం బొమ్మకల్‌కు చెందిన మానస రెడ్డి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తం అయ్యారు. ఎంపీ అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేయాలంటే రూ.25 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మానస రెడ్డి సామాన్యుల గొంతుకగా బరిలో నిలుస్తానని ప్రకటించడంతో పాటు ప్రజల సహకారాన్ని కూడా అభ్యర్థించారు. ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్వాగతించిన వారంతా కూడా తమవంతుగా సాయం అందించారు.
30 వేల రూపాయల నాణేలు : ఆయా గ్రామాలకు చెందిన వారంతా నాణేలు ఇచ్చి మానస రెడ్డికి మద్దతు ఇచ్చారు. ఆమెకు అండగా నిలిచిన వారు ఇచ్చిన కాయిన్లు అన్నీ లెక్కిస్తే రూ.30 వేలు కాగా అందులో రూ. 25 వేల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించేందుకు నామినేషన్‌కు తీసుకొచ్చారు. ఎన్నికల్లో నిలబడాలని ప్రోత్సహించిన వారు ఇచ్చిన కాయిన్స్‌నే నామినేషన్ సెక్యూరిటీ డిపాజిట్ కోసం వినియోగించాలని భావించారు. అందుకే వాటినే తీసుకొచ్చి ఎన్నికల అధికారులకు అప్పగించారు.
ఇది చూసే వారికి వెరైటీగా అనిపించినప్పటికీ మానస రెడ్డి మాత్రం తనను అక్కున చేర్చుకున్న వారికే ప్రాధాన్యత ఇస్తానంటూ నామినేషన్ ప్రక్రియ నుంచే చేతల్లో చూపిస్తున్నానని అంటున్నారు. వారిచ్చిన నగదునే డిపాజిట్ రూపంలో చెల్లించి వారి ఆశయాల మేరకే నడుచుకునే ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు. ఏది ఏమైనా మానస రెడ్డి నామినేషన్ కేంద్రానికి గంపతో కాయిన్స్ తీసుకుని రావడం మాత్రం అందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది.
పేదల కోసం : అయితే మానసరెడ్డి ఓ గంపను కూడా పట్టుకుని రావడంతో నామినేషన్ సెంటర్ వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న అధికారులు అడ్డుకున్నారు. దీంతో గంపను తలమీద నుంచి దించి చూపించడంతో బందోబస్తు నిర్వహిస్తున్న జవాన్లు, అధికారులు అవాక్కయ్యారు. ఆ గంపలో చిల్లర కాయిన్లను తీసుకుని నామినేషన్ వేసేందుకు వచ్చిన ఆమెను అధికారులు లోపలకు అనుమతించారు. అంతేకాకుండా పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా తనదైన రీతిలో విస్తృతంగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు ఆమె.
'నా పేరు పేరాల మానస రెడ్డి. కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశీస్సులతో మా అజెండాను నిర్ణయించా. ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య, మిషనరీతో కూడిన వైద్యశాల ఏర్పాటు చేస్తా. రైతులకు ఉచిత కేంద్రీయ ఎరువులు, తన పంటకు తానే ధర నిర్ణయించుకునే అవకాశం కల్పిస్తాం'- పేరాల మానస రెడ్డి, కరీంనగర్ స్వతంత్ర ఎంపీ అభ్యర్థి