Wind Rain Disaster in Manyam And Anakapalli Districts: నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడటంతో పలు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచంపేటలో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. వర్షపు నీరు వెళ్లేందుకు కాలువలు సక్రమంగా లేకపోవడంతో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
మన్యం, అనకాపల్లి జిల్లాల్లో సాయంత్రం వర్షం బీభత్సం సృష్టించింది. మన్యం జిల్లా సాలూరులో గాలి- వాన తాకిడికి పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రోడ్డు పక్కనున్న వస్తువులు, తోపుడు బండ్లు సైతం విపరీతమైన గాలులకి కొట్టుకుపోయే విధంగా మారడంతో ప్రజలు హడలిపోయారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలోని పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. సుమారు గంటసేపు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. గొలుగొండ సమీప పొలాల్లోని చెట్లపై పిడుగు పడడంతో రైతులు, కూలీలు భయాందోళన చెందారు.
మరో మూడు రోజుల్లో మరింత చురుకుగా నైరుతి రుతుపవనాలు - Andhra Pradesh Weather Update
నర్సీపట్నం సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటసేపు ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పట్టణంలోని రహదారులు మొత్తం జలమాయమయ్యాయి. సాలూరు నగరంతోపాటు బంగారం కాలనీ, వెంకటేశ్వర కాలనీ సాలూరు జాతీయ రహదారి, మెయిన్ రోడ్లో కురిసిన భారీ వర్షానికి కరెంట్ తీగలు తెగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలపై వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు జోరందుకుంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
రాష్ట్రమంతా విస్తరించిన రుతుపవనాలు- పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు - Rain alert