Votes with Zero House Number in AP Voter List: ఏపీ ఓటరు జాబితాలో అక్రమాలకు అంతేలేకుండా పోతోంది. ఏళ్ల క్రితం చనిపోయిన వారికీ ఓటర్ జాబితాలో చోటు, వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో భార్య, భర్తల ఓట్లు.. అధికార పార్టీ నేతలకు రెండు, మూడేసి ఓట్లు ఇవిచాలవన్నట్టు సున్నా ఇంటి నంబర్‌తో ఓట్లు. ఇలా ఓటరు జాబితాలో తవ్వేకొద్దీ తప్పులే కన్పిస్తున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో జీరో ఇంటి నంబర్‌తో కుప్పలు తెప్పలుగా ఓట్లు వెలుగుచూశాయి. వీటన్నింటినీ పరిశీలిస్తే ఓటరు జాబితా రూపకల్పనలో అధికారుల అలసత్వం బహిర్గతం అవుతుంది. దీనిపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారు.
కూడేరు మండలం బ్రాహ్మణపల్లిలోని పోలింగు కేంద్రం 243లో 778 మంది ఓటర్లు ఉన్నారు. ఈ కేంద్రంలోని జాబితా వరుస సంఖ్య 710, 712, 713, 714, 715, 716, 717, 732, 771, 772, 773, 774, 777 లో ఉన్న ఓట్లు సున్నా ఇంటి నంబరుతో నమోదయ్యాయి. మరికొంత మందికి వార్డు అంకె లేకుండా ఉన్న ఇంటి నంబర్లతో ఓటు కల్పించారు. కొంతమంది ఓటర్లకు ఇంటి నంబర్ల స్థానంలో ప్లాటు నంబర్లను నమోదు చేశారు.
ఓటరు జాబితాలో ఇంటి నంబర్ల మాయాజాలం - రెండు నంబర్లతో 46 ఓట్లు
మరోవైపు ఉరవకొండ మండలంలోని కోనాపురంలోని పోలింగు కేంద్రం 159లో 675 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి జాబితాలోని వరుస సంఖ్య 680, 682, 683, 686లలో ఉన్న ఓటర్లు '00'(Two Zeros) ఇంటి నంబర్లతో నమోదు అయ్యి ఉన్నారు. 512లో ఉన్న ఓటరుకు ఇంటి సంఖ్య స్థానంలో బీసీ కాలనీగా నమోదు చేశారు. బెళుగుప్పకు చెందిన మందల రాధలీలకు పోలింగ్ కేంద్రం 189లో వరుస సంఖ్య 20, పోలింగ్ కేంద్రం 188లో వరుస సంఖ్య 194లో ఓట్లు ఉన్నాయి.
లత్తవరం 155 పోలింగు కేంద్రంలో 462 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి జాబితాలోని వరుస సంఖ్య 6, 7, 8, 9, 473, 475, 476లతో పాటు మరో ఇద్దరి ఓటర్లకు ఇంటి నంబర్లు 1- 00, 1-000, 2-00గా నమోదు చేశారు. 00 ఇంటి నంబర్లు ఉండరాదని ఎన్నికల సంఘం చెప్పినా క్షేత్ర స్థాయి అధికారులు మాత్రం దానిని పెడచెవిన పెట్టారు. ఓటరు జాబితాలో ఇలాంటివి ఉండడం పలు విమర్శలకు తావిస్తోంది.
అవిగో ఎన్నికలు - ఇవిగో దొంగ ఓట్లు 'సమయం దగ్గరపడుతున్నా ఓటర్ల జాబితాలో తప్పులు'