Vizianagaram Utsav 2024: కళలకు, కళాపోషణకు పుట్టినిల్లు విజయనగరం జిల్లా. మహాకవి గురజాడ వంటి ఎందరో మహానుభావులు, మేధావులను ఈ జిల్లా ప్రపంచానికి పరిచయం చేసింది. ఇక్కడి ప్రతి ప్రాంతం చారిత్రక ప్రదేశమే. సంస్కృతికి దర్పణమే. ఈ వైభవాన్ని గుర్తు చేసుకుంటూ ఏటా విజయనగర ఉత్సవాలు జరుగుతున్నాయి. 2 రోజులు జరిగే ఈ కార్యక్రమంలో తొలిరోజు సంబరాలను ఇప్పుడు చూద్దాం.
విజయనరం జిల్లా ఘనచరిత్ర, సంస్కృతి సంప్రదాయలను చాటిచెప్పే ఉత్సవాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా పైడితల్లి ఆలయం వద్ద ఉత్సవాలకు శంఖం పూరించారు. ఆ తర్వాత ఆలయం నుంచి అయోధ్య మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పైడితల్లి ఆలయం నంచి కోట, సింహాచలం మేడ, సంస్కృత కళాశాల, గురజాడ కళాక్షేత్రం మీదుగా సాగిన ఈ ర్యాలీలో సమారు 500 మంది కళాకారులు పాల్గొన్నారు. కత్తిసాము, కర్రసాము, కోలాటం, థింసా నృత్యం, చెక్కభజన, పులివేషాలు, తప్పెటగుళ్ల ప్రదర్శనల మధ్య కోలాహలంగా సాగింది. అనంతరం అయోధ్య మైదానంలో శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు, మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, సంధ్యారాణి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి, కలెక్టర్ అంబేడ్కర్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు బెలూన్లు ఎగరేసి ఉత్సవాలను ప్రారంభించారు.
సిరి సంపదలనిచ్చే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం - ఆలయ చరిత్ర, జాతర విశేషాలివే!
విజయనగరం ఉత్సవాల కోసం అధికారులు 11 వేదికలను సిద్ధం చేశారు. ఆనంద గజపతి రాజు కళాక్షేత్రంలో సాంస్కృతిక, శాస్త్రీయ, సంగీత నృత్య ప్రదర్శన ఏర్పాటుచేశారు. మన్సాస్ మైదానంలో ఫల, పుష్ప ప్రదర్శన, గురజాడ కళాభారతిలో పౌరాణిక, సాంఘిక నాటక ప్రదర్శనలు, కోటలో విద్య, వైజ్ఞానిక ప్రదర్శన, విజ్జీ క్రీడా మైదానంలో క్రీడాపోటీలు, ఆయోధ్య మైదానంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. వీటిలో ఫల, పుష్ప ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రదర్శనలో వందల రకాల పుష్పాలు, మేలు జాతులకు చెందిన పలు రకాల ఫలాలను ప్రదర్శనకు ఉంచారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అధిక శాతం సాగయ్యే కూరగాయలు, సుగంధ పంటల ఉత్పత్తులు, ఔషధ మొక్కలు ఏర్పాటు చేశారు.
కోటలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. స్టాంపులు, నాణేలు, ఆర్ట్ గ్యాలరీలను చూసేందుకు జనం ఆసక్తి కనబరిచారు. గురజాడ కళాక్షేత్రంలో సాంఘిక, పౌరాణిక నాటకాలు, ఏకపాత్రభినయాల ప్రదర్శన ఆద్యంతము ఆహుతులను కట్టిపడేశాయి. ఆనంద గజపతి ఆడిటోరియంలో శాస్త్రీయ సంగీతం, కూచిపూడి, భరతనాట్యం, సంగీతం వంటి కళలతో కళాకారులు ప్రతిభను ప్రదర్శించారు. ఆయోధ్య మైదానంలో నిర్వహించిన జబర్దస్త్ బృందం కామెడీ, బెంగాల్ బృందం నృత్య ప్రదర్శన, మ్యూజికల్ నైట్ అలరించాయి.
పైడితల్లి సిరిమాను సంబరాలకు సర్వం సిద్ధం- జాతర విశిష్టతతోపాటు షెడ్యూల్ మీకోసం!