Vizianagaram Farmer Cultivates 12 Varieties Of Desi Paddy : అనూహ్యంగా ఎదురయ్యే కొన్ని ఘటనలు మన జీవిత గమ్యాన్ని మారుస్తాయి. అప్పటిదాకా సాగుతున్న ప్రయాణాన్ని కాదని, కొత్త ప్రస్థానానికి నాంది పలుకుతాయి. ఏపీలోని విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం గొల్జాం గ్రామస్థుడు తూర్పాటి సత్య నారాయణదీ అలాంటి ప్రస్థానమే.
తన తల్లిని క్యాన్సర్ పొట్టన పెట్టుకోవడంతో తీవ్రంగా మదనపడిన సత్య నారాయణ, రసాయన ఎరువులతో పండించిన ఆహార దినుసులు తీసుకోవడమే కారణమని గట్టిగా నమ్మారు. జీవన శైలిలో మార్పులతో పాటు ప్రకృతి సిద్ధంగా పండిన పంట ఉత్పత్తులనే ఆహారంగా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెస్సీ (MSC) గణితం చదివి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న సత్య నారాయణ, సేంద్రియ సాగు వైపు మళ్లారు. ఒకనాటి దేశీయ వంగడాలను సేకరించిన ఆయన, విత్తనాలు తయారు చేసుకొని, సేంద్రియ పద్ధతుల్లో పండించి, సహజ సిద్ధమైన ఆహార ఉత్పత్తుల తయారీకి పూనుకున్నారు. ఇప్పుడతని అనుభవైక వైద్యం తోటి రైతులకు ఆదర్శ సేద్యం.
గోమూత్రంతో ఎరువులు : సత్య నారాయణ ఏడు సంవత్సరాల క్రితం గో ఆధారిత ప్రకృతి సాగును ప్రారంభించే మునుపు ప్రముఖ ప్రకృతి వ్యవసాయవేత్త సుభాష్ పాలేకర్, సేవ్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ విజయరామ్‌ల నుంచి సూచనలు తీసుకున్నారు. గ్రామంలో తనకు ఉన్న ఐదు ఎకరాలకు తోడు ఎల్.కోటలో మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. మొత్తం 13 ఎకరాల్లో 12 రకాల దేశీయ వంగడాల సాగు చేస్తున్నారు. సొంతంగా గోకులం నిర్మించుకొని పది ఆవులను పెంచుతున్నారు. గోమూత్రం ఆధారంగా ఘనామృతం, వాన పాములు, పంచగవ్య, వేపాకుతో నీమాస్త్రం, దశ పత్ర కషాయాలు తయారు చేసుకుంటారు. వాటిని పంటకు ఎరువులుగా ఉపయోగిస్తున్నారు.
ఒకసారి నాట్లు వేస్తే 8 పంటలు.. సఫలమైన కొత్త వరి వంగడం సాగు
సొంత స్టాల్ ద్వారా అమ్ముతున్నాను : సామాజిక దృక్పథంతో ఈ పంటలు పండిస్తున్నానని, ఈ విత్తనాలు అవసరం అయిన వారికి శాంపిల్‌గా ఇస్తున్నానని సత్య నారాయణ తెలిపారు. చాలా మంది సలహాల కోసం తన పొలాన్ని చూసి వెళ్తున్నారని అన్నారు. ఈ రకాలు ఎలాంటి సాగు భూమిలోనైనా పండించవచ్చని వివరించారు. పంట ధాన్యాన్ని స్వయంగా మిల్లుల్లో ఆడించి, వచ్చిన బియ్యాన్ని విశాఖపట్నంలోని సొంత స్టాల్ ద్వారా అమ్ముతున్నానని ఆయన తెలిపారు.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : సిద్ధసన్నాలు, రాజముడి, చిట్టి ముత్యాలు, శైవగజ, బహురూపి, కాలాబట్టి, కుళాకర్, నవారా, మైసూరు మల్లిగ, కోతాంబరి, మాపిళ్లే సాంబ, రత్నచోడి రకాల వరి పండిస్తున్నారు. ఈ విత్తనాలను ఎకరాకు 3-5 కిలోలే ఉపయోగించారు. వరి నారు వేసిన 14 రోజుల నుంచి 21 రోజుల్లో ఊడుపు చేశారు. వీటి పంట కాలం రకాన్ని బట్టి 110 నుంచి 160 రోజుల వరకూ ఉంటుంది. దిగుబడి కూడా ఒక ఎకరానికి సగటున 20-25 బస్తాల వరకు వస్తుంది. ఖనిజ లవణాలు, విటమిన్లు, ఇతర పోషకాలు సరైన మోతాదులో ఉండే ఈ రకాలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు వెల్లడించినట్లు సత్య నారాయణ తెలిపారు.