Vizag Drugs Case YSRCP Relation: విశాఖపట్నం పోర్టులో డ్రగ్స్ దొరికిన వ్యవహారంలో సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్సు కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు, సీఈవో కూనం కోటయ్య కుటుంబం తొలి నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీలో కొనసాగుతోంది. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని ఈదుమూడికి చెందిన కూనం కోటయ్య, సుబ్బాయమ్మ దంపతులకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. వారిలో పెద్దకుమారుడు శామయ్య, చిన కుమారుడు చిన వీరభద్రరావు అమెరికాలో స్థిరపడ్డారు!
మూడో కుమారుడు వీరభద్రరావు, నాలుగో కుమారుడు రమణ ఆక్వా వ్యాపారం నిమిత్తం 25 పాతికేళ్లుగా సొంతూరికి దూరంగా ఉంటున్నారు. కాకినాడ, పామర్రు, వైజాగ్ ప్రాంతాల్లో వీరికి ఆక్వా కంపెనీలున్నాయి. కోటయ్య రెండో కుమారుడు పూర్ణచంద్రయ్య స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ, రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. వీరి ఉమ్మడి కుటుంబానికి ఈదుమూడిలో ఒక ఇల్లు ఉంది. పూర్ణచంద్రయ్య మరో ఇల్లు నిర్మించుకుని అక్కడే నివాసం ఉంటున్నారు.
మిగిలిన నలుగురు అన్నదమ్ములు పండుగ, కుటుంబ కార్యక్రమాలకు అప్పుడప్పుడు సొంతూరు వచ్చి రెండుమూడు రోజులు ఉండి వెళ్లిపోతుంటారు. మొదటి నుంచి కూనం కోటయ్య కాంగ్రెస్ మద్దతుదారుగా ఉన్నారు. స్థానికంగా నివాసముండే పూర్ణచంద్రయ్య కాంగ్రెస్ మద్దతుతో గతంలో సర్పంచిగా, ఆయన భార్య కూనం విజయలక్ష్మి ఎంపీటీసీ సభ్యురాలిగా చేశారు. ఆ తర్వాత వీరు వైసీపీలో చేరారు! ప్రస్తుతం పూర్ణచంద్రయ్య వైసీపీ సీనియర్ నాయకుడిగా, ఈదుమూడి సొసైటీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.
ఈ ఏడాది సంక్రాంతికి కూనం వీరభద్రరావు కుటుంబం ఈదుమూడికి వచ్చింది. ఆ సమయంలో వీరభద్రరావు కుటుంబ సభ్యులకు స్వాగతం పలుకుతూ స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు సోదరుడు పూర్ణచంద్రయ్య ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను గ్రామంలో ఏర్పాటు చేశారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త ఎంపీ విజయసాయిరెడ్డిని స్థానిక ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు సమక్షంలో పూర్ణచంద్రయ్య కలిశారు! గ్రామ, మండల రాజకీయాల గురించి చర్చించారు.
సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ఎండీ విజయసాయి సన్నిహితు: విశాఖ డ్రగ్స్ అంశంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి స్పందించారు. సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ బుక్ చేసిన కంటైనర్‌లో డ్రగ్స్ దొరికాయని పేర్కొన్నారు. సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ ఎండీ వీరభద్రరావు విజయసాయి సన్నిహితుడే అని పట్టాభి తెలిపారు. వీరభద్రరావు సోదరుడు పూర్ణచంద్రరావు వైసీపీ సీనియర్ నేత అని ఆరోపించారు. పూర్ణచంద్రరావుకు పీఏసీఎస్ ఛైర్మన్ పదవిని వైసీపీ ఇచ్చిందని అన్నారు. బ్రెజిల్‌లో విజయసాయిరెడ్డికి చీకటి వ్యాపారాలు ఉన్నాయని, బ్రెజిల్ దేశాధ్యక్షుడు లులా డిసిల్వాకు శుభాకాంక్షలు చెప్పారన్నారు. లులా డిసిల్వాను అభినందిస్తూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారని గుర్తు చేశారు.
లులా డిసిల్వాకు విజయసాయి శుభాకాంక్షలు చెప్పడమేంటని ప్రశ్నించారు. డ్రగ్స్ సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని జగన్ యత్నిస్తున్నారని, 25 వేల కిలోల డ్రైడ్ ఈస్ట్ ముసుగులో డ్రగ్స్ సరఫరా చేశారని ఆరోపించారు. డ్రగ్స్ ఉన్న కంటైనర్‌ను సీబీఐ స్వాధీనం చేసుకుందన్న పట్టాభిరామ్, కంటైనర్‌ను సీబీఐ తనిఖీ చేసేందుకు వెళ్తే అడ్డుకున్నారని అన్నారు. అధికార పార్టీకి సంబంధం లేకుంటే ఎందుకు అడ్డుకోవాలని, డ్రగ్స్ అక్రమరవాణాలో ఏపీని తొలిస్థానంలో నిలబెట్టారని పట్టాభిరామ్ మండిపడ్డారు. ఏపీ తొలిస్థానంలో ఉన్నట్లు డీఆర్‌ఐ నివేదికే వెల్లడించిందని, ఆ నివేదిక సీఎం జగన్ పనితీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. యువతను మాదకద్రవ్యాలకు బానిసల్ని చేస్తారా అంటూ పట్టాభిరామ్ నిలదీశారు.
'వైసీపీ పాలనలో విశాఖ - గంజాయే కాదు అంతర్జాతీయ డ్రగ్స్ కేంద్రంగా మారింది' - Visakha Drug Case