Visakhapatnam Floating Bridge Delinked: విశాఖ సాగర తీరంలో వీఎంఆర్‌డీఏ (Visakhapatnam Metropolitan Region Development Authority) ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ వంతెన మళ్లీ ప్రధాన వంతెనతో విడిపోయింది. సందర్శకులకు ఇంకా అందుబాటులోకి తేనప్పటికి ప్రయోగ సమయంలోనే రెండోసారి ఇలా జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎక్కువ అలల తాకిడికి ఈ రకంగా జరుగుతుందని, దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదన్నది అధికారుల ఉవాచ. సాగర తీరానికి వచ్చిన సందర్శకులు మాత్రం దూరం నుంచే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని చూసి వెళ్లిపోతున్నారు. దాదాపు కొటిన్నరకు పైగా వెచ్చించి పర్యాటక అకర్షణగా ఏర్పాటు చేశారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఇది పరిశీలన దశలోనే ఉండడంతో సందర్శకులను ఈ వంతెనపైకి అనుమతించడం లేదు.
విశాఖలోని ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జి శనివారం మధ్యాహ్నం చెల్లాచెదురవడం మళ్లీ కలకలం రేపింది. ఈ వంతెనను గత నెల 25వ తేదీన వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో వైసీపీ నేతల సమక్షంలో ప్రారంభించారు. అనంతరం ఒక్క రోజులోనే టీ జాయింట్ విడిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
అయ్యయ్యో ప్రారంభించిన మరునాడే తెగి - 300 మీ. కొట్టుకుపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి
అయితే అధికారులు మాత్రం అలలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మాక్ డ్రిల్ నిర్వహించి టీ జాయింట్‌ను దూరంగా తీసుకువెళ్లి లంగరు వేశామని చెప్పుకొచ్చారు. అప్పటి నుంచి సందర్శకులను అనుమతించడంలేదు. పూర్తిస్థాయిలో రెడీ అయ్యాకే పర్యాటకులను అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు. దీంతో కొందరు నిపుణులను తీసుకువచ్చి లోపాలు జరగకుండా ఎలా నిర్వహించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో మరోసారి టీ జాయింట్ తెగిపోవడం చూసిన సందర్శకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతే కాకుండా ఒకానొక సమయంలో ఫ్లోటింగ్ బ్రిడ్జి నీటిలో మునిగిపోయినంత పరిస్థితి తలెత్తింది. కొంత సమయానికి బ్రిడ్జిని తీరం వైపు తీసుకొచ్చినా ఒరిగిపోయి కనిపించడంతో, అది చూసిన సందర్శకులు ఆందోళన వ్యక్తం చేశారు. వంతెనకు అనుసంధానంగా ఉన్న డబ్బాలు సైతం కొన్ని దెబ్బతిన్నాయి. మధ్యాహం మూడు గంటల సమయంలో వంతెన మీద నుంచి మూడు, నాలుగు అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. దీంతో అసలు ఇక్కడ వంతెన ఏర్పాటు చేయడం అనుకూలమేనా అనే సందేహం తలెత్తుతోంది.
ఒక్క రోజులోనే: తొలుత ఈ వంతెనను ఫిబ్రవరి 25వ తేదీన అట్టహాసంగా ప్రారంభించారు. అయితే ఆ మరుసటి రోజే రెండు ముక్కలై తేలుతూ కనిపించింది. ఆ సమయంలో పర్యాటకులను ఇంకా అనుమతించకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ వంతెన కోసం దాదాపు కోటి 60 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. అధికారులు మాత్రం ట్రయల్ రన్ అని, సాంకేతిక పరిశీలనలో భాగంగా దానిని వేరు చేశామని తెలిపారు. తాజాగా రెండోసారి ఫ్లోటింగ్ వంతెన తెగిపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ప్రారంభించిన మరుసటి రోజే మూడు ముక్కలైన విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జి