Visakhapatnam Treasury Office Problems: విశాఖ కలెక్టర్ కార్యాలయం నిర్మించి వందేళ్ల దాటింది. విశాఖలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, రెవెన్యూ ఇతర అనుబంధ శాఖలు కలెక్టరేట్ నుంచే పని చేస్తాయి. విశాఖ ఉద్యోగుల జీతభత్యాలు ఇతర ఆర్థికపరమైన అంశాలు పరిశీలించే ఖజానా కార్యాలయం ఈ కలెక్టరేట్‌లోనే ఉంది. 2014లో వచ్చిన హుద్ హుద్ తుపాను దెబ్బకు ఖజానా కార్యాలయ విభాగం పైకప్పు దెబ్బతింది. ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ సర్కార్ దీని నిర్వహణను పట్టించుకోలేదు. దీంతో పూర్తిగా దెబ్బతింది. గత డిసెంబర్‌లో కురిసిన వర్షాలకు ఖజానా కార్యాలయంలో ముఖ్యమైన పరిపాలన విభాగం మిద్దె కూలిపోయింది. అదృష్టవశాత్తు ఉద్యోగులు సురక్షితంగా బయట పడ్డారు.
వర్షం వస్తే కార్యాలయ ఖజానా విభాగం గదులు ఉన్న చోట చెరువుని తలపిస్తోంది. వర్షం కురిసే సమయంలో ఎక్కడ వర్షం నీరు పడటం లేదో, అక్కడికి ఉద్యోగులు వెళ్లి సర్దుకుని పోయి, కూర్చోవలసి వస్తోంది. అలాగే వర్షాకాలంలో తాము పని చేసే కంప్యూటర్లు తడిచిపోకుండా కవర్లను, టార్పాలిన్లను సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమ విభాగాన్ని బాగు చేయడం కోసం మొరపెట్టుకుంటే, కోటి రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆ బిల్లులు ఇవ్వడానికి గాని, పనులు చేయడానికి గుత్తేదారుడు కూడా ముందుకు రాని పరిస్థితి. ఫలితంగా ఖజానా కార్యాలయం వర్షపు నీటికి తడిసి ముద్ద అయ్యింది. ఉద్యోగులు పడరాని పాట్లు పడుతున్నారు.
శిథిలావస్థలో పాఠశాల భవనాలు - కొత్తవి నిర్మించాలని విద్యార్థుల మొర - Dilapidated School Buildings
చిన్నపాటి వర్షానికే ఖజానా కార్యాలయంలోకి నీరు చేరి ఉద్యోగులు పడరాని పాట్లు పడుతున్నారు. పూర్తిగా దెబ్బతిన్న కార్యాలయంలో బిక్కుబిక్కుమంటూ పని చేస్తున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఖజానా కార్యాలయం పరిస్థితి మీద కలెక్టర్ హరేంధిర ప్రసాద్ దృష్టి పెట్టారు. ఖజానా కార్యాలయం పరిస్థితిపై ముఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. త్వరలో మరమ్మతులు చేయడం గాని లేదా సమీపంలో ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ ఆఫీస్ బిల్డింగులోని ఒక అంతస్తు పూర్తిగా ఖజానా కార్యాలయానికి అప్పగించడంపైనా చర్చలు జరుగుతున్నట్టు ఖజానా కార్యాలయ ముఖ్య సంచాలకులు తెలిపారు.
గత ప్రభుత్వంలో కనీసం కార్యాలయాల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం పట్టించుకోలేదనడానికి విశాఖ ఖజానా కార్యాలయమే ఒక ఉదాహరణ. కనీసం మరమ్మతులకు గాని ఇతర అంశాలకు గాని ప్రాధాన్య ఇవ్వకపోవడంతోనే కార్యాలయం పూర్తిగా పాడైపోయి ఏ క్షణాన కూలిపోతుందో అనే భయంలో ఉద్యోగులను ఉంటున్నారు. ప్రస్తుత కలెక్టర్, ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టడంతో త్వరలోనే శాశ్వత పరిష్కారం వస్తుందని ఆశాభావంతో ఉద్యోగులు ఉన్నారు.
నిర్లక్ష్యం వీడని విద్యుత్ అధికారులు - పొంచి ఉన్న ప్రమాదం - ap Electricity Officials Negligence