Visakha Steel Plant Contract Workers Issue Resolved : విశాఖ స్టీల్‌ప్లాంట్ ఒప్పంద కార్మికుల సమస్యకు తెరపడింది. ఒప్పంద కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ కార్మికులు ఇటీవల ఆందోళ బాటపట్టారు. కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని భావించిన యాజమాన్యం వారిని విధుల్లోకి తీసుకునేందుకు అంగీకరించింది. ఈ మేరకు ప్రాంతీయ లేబర్ కమిషనర్ సమక్షంలో ఒప్పంద పత్రాలపై కార్మిక సంఘాల ప్రతినిధులు సంతకాలు చేశారు.
సెప్టెంబర్ 27న విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 4200 కార్మికుల ఎంట్రీ పాసులను నిలుపుదల చేసింది. ఈనెల 29న కొత్త గేట్ పాస్ విధానం అమల్లోకి తీసుకువచ్చింది. ఆన్లైన్లో వారి ఎంట్రీపాసులను తీసివేయడంతో ప్లాంట్ లోపలికి సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది అనుమతించలేదు. వారి సమస్యను యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో ఒప్పంద కార్మికులు ఈడీ వర్క్స్ కార్యాలయాన్ని ముట్టడించారు.
ఆగ్రహించిన కొందరు కార్మికులు అక్కడి కార్యాలయ అద్దాలను కూడా ధ్వంసం చేశారు. తక్షణమే సీఐఎస్ఎఫ్, స్ధానిక పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగి పరిస్దితి చేజారకుండా చర్యలు చేపట్టింది. వారిని అక్కడే నిరసన చేసేందుకు అనుమతించింది. సమస్యకు పరిష్కారం లభించే వరకు తామిక్కడే ఉంటామని కార్మికులు భీష్మించడంతో రాత్రంతా దాదాపు అదే భవనం వద్ద వారంతా ఉండిపోయారు. ఈ ఉదయం కూడా కూర్మన్నపాలెం కూడలి వద్ద వారు నిరసనకు దిగడం, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళనకు దిగి కార్మికులకు మద్దతు పలకడం తీవ్రతకు అద్దంపట్టాయి.
ఇదే సమయంలో జరిగిన చర్చలు సాయంత్రానికి సమస్యకు పరిష్కారం లభించడంతో కార్మికులకు ఊరట లభించనట్టయింది. ఈ క్రమంలో ప్రస్తుతం అమల్లో ఉన్న గేట్ పాస్ విధానాన్ని కొనిసాగిస్తామని యాజమాన్యం అంగీకరించింది. 7 రోజుల్లోగా ఆన్లైన్ గేట్ పాస్ విధానాన్ని పునరుద్దరించడానికి, లేబర్ చట్టాలను అమలు చేయడానికి కూడా అంగీకారం కుదిరింది. ఇందులో సీఐటీయు, ఐఎన్టీయుసీ, హెచ్ఎంఎస్, ఎఐటీయుసీ, టీఎన్టీయుసీ, వంటి ప్రధాన యూనియన్ల ప్రతినిధులు, ప్రాంతీయ కమిషనర్ కేజే మహంతి సమక్షంలో ఉక్కు యాజమాన్య ప్రతినిధులు సంతకాలు చేశారు.
తిరుమల భక్తులకు గుడ్‌న్యూస్ - వాట్సాప్ ద్వారా దర్శనం బుకింగ్ - TTD Darshan Through WhatsApp