Visakha MRO Ramanaiah Murder Case Accused : సాధారణంగా ప్రతినాయకుడి పాత్రలో నటించేవారు వ్యక్తిగతంగా చాలా సున్నితంగా ఉంటారని చెబుతూ ఉంటారు. కానీ ఓ వెబ్ సిరిస్‌లో విలన్ పాత్రలో నటించి హత్యలు చేసిన ఓ వ్యక్తి మాత్రం నిజ జీవితంలోనూ అదే పాటించి ఆ మాటల్ని పటాపంచలు చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు. విశాఖలోని తహసీల్దార్ హత్య (Visakha Tahsildar Murder) కేసు నిందితుడు. రీల్ లైఫ్‌లోనే కాదు నిజ జీవితంలోనూ తాను విలనేనని చాటుకున్నాడు.
Murari Subrahmanyam Ganga Rao Acted in The Night Web Series : రాష్ట్రంలో సంచలనం రేపిన తహసీల్దారు రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారావు చీకటి జీవితంలోని అంశాలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయి. 2 కోట్ల 50 లక్షల మేర మోసం చేసినట్లు అతడిపై హైదరాబాద్, విజయవాడ పరిధిలో నమోదైన రెండు కేసులను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. వెండితెరపై మక్కువతో మూడేళ్ల క్రితం 'ది నైట్ (The Night)' పేరుతో రెండు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ మురారి తీశాడు. ఇందుకు 40 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడికి డబ్బులు ఇవ్వకపోవడంతో సిరీస్ పూర్తి చేయకుండానే అతడు వెళ్లిపోయాడు.
ఎమ్మార్వో హత్య నిందితుడిని గుర్తించాం- రియల్ ఎస్టేట్, భూవివాదాలే కారణం: సీపీ రవిశంకర్
దాంతో తానే దర్శకత్వ బాధ్యతలు వహించిన మురారి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. హింస ఎక్కువ ఉండటంతో ఈ సిరీస్ ఓటీటీ విడుదలకు అభ్యంతరాలు వచ్చాయి. హైదరాబాద్‌లో కోటీ 80 లక్షల రూపాయల మోసానికి పాల్పడ్డాడు. ది నైట్ సిరీస్‌ను వేరే నిర్మాతలకు అమ్మి డబ్బులు చెల్లిస్తానంటూ ఆ కేసు నుంచి బయటపడే ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. సిరీస్ ట్రైలర్‌లో మురారి ఓ యువతి తలపై కొడతాడు. అదే విధంగా తహసీల్దారు రమణయ్యను ఇనుప రాడ్‌తో తలపై కొట్టి హత్య చేసినట్లు సీసీ టీవీ ఫుటేజీలో కనిపించింది.
భూవివాదాలు-హత్యలకు తెగబడుతున్న అక్రమార్కులు - ఎమ్మార్వో హత్యతో అధికారుల్లో కలవరం
Visakha Tahsildar Murder : కన్వేయెన్స్ డీడ్ వ్యవహారంలో తహసీల్దారుకు, తనకు మధ్య నడిచిన లావాదేవీల గురించి నిందితుడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీలో మేనేజర్‌గా మురారి పని చేస్తున్నారని, దానిపేరు "వి" అంటూ సోమవారం నిర్వహించిన సమావేశంలో సీపీ రవిశంకర్ పేరు పూర్తిగా చెప్పకుండా ఆపేశారు. ఆ వీఎన్‌సీ కంపెనీయే మధురవాడలోని జ్యువెల్ పార్కు అపార్ట్‌మెంట్స్ ప్రాజెక్టు చేపట్టింది. అందులోని డి-బ్లాక్‌లో మురారి ఉంటున్నాడు. ఇదే ప్రాజెక్టు స్థలం కన్వేయెన్స్ డీడ్ వ్యవహారంలోనే తహసీల్దారు కార్యాలయానికి కొన్నిరోజులుగా వెళుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ హత్యలో తెరవెనక ఎవరు ఉన్నారనేది గోప్యంగా ఉంచుతున్నారు. ప్రభుత్వంలోని పెద్దలకు సన్నిహితంగా ఉన్న ఓ నిర్మాణ సంస్థ యాజమాన్యం ద్వారా పావులు కదిపి తెరవెనుక అసలు కథను కనుమరుగు చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విశాఖపట్నంలో తహసీల్దార్ దారుణ హత్య - ఉలిక్కిపడ్డ రెవెన్యూ యంత్రాంగం